ప్రజా ప్రతినిధులు, నేతల తీరుతోనే ఏ పార్టీ అయినా గబ్బు పడుతుంది. చంద్రబాబునాయుడు హయాంలో ఎంఎల్ఏలు, నేతల అరాచకాలతోనే జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలితో జనాల్లో టిడిపి ఎంతటి అప్రదిష్ట మూటగట్టుకున్నది అందరూ చూసిందే.

 

ఒక్క చింతమనేనే కాదు గురజాల మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు , మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని లాంటి వాళ్ళు హద్దులు దాటిపోవటంతోనే పార్టీ గబ్బుపట్టింది. వాళ్ళ మద్దతుదారులకు మాత్రం బాగుండచ్చు కానీ వాళ్ళ దూకుడు స్వభావంతో ఇతర నియోజకవర్గాల్లో చంద్రబాబు అప్రదిష్ట కొనితెచ్చుకున్నారు.

 

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం బాగా వివాదస్పదమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇలాంటి దూకుడుతోనే వివాదాస్పదమయ్యారు. అప్పుడుంటే ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. మరి అదే దూకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యు చేస్తానంటే కుదరదని తెలుసుకోవాలి.

 

అధికారంలోకి రాగానే జర్నలిస్టుతో గొడవ. అది సద్దుమణగక ముందే తాజాగా ఎంపిడివో వివాదం. ఈ రెండు ఘటనలతో కోటంరెడ్డితో పాటు వైసిపి కూడా జనాల్లో పలచనైపోతోంది. ఇక్కడ తప్పు ఒప్పు అన్నది పక్కనపెడితే జనాల నోళ్ళల్లో మాత్రం నెగిటివ్ టాక్ వచ్చేస్తోంది.

 

ఇటువంటి వాళ్ళను మొదట్లోనే కంట్రోలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి బాగా ఇబ్బంది పడటం ఖాయమే. పై రెండు ఘటనల్లోను జగన్ జోక్యం చేసుకోని కారణంగా పోలీసులు నిర్భయంగా ఎంఎల్ఏ మీద కేసు పెట్టారు. పైగా ఎంపిడివో వివాదంలో కోటంరెడ్డిని అరెస్టు కూడా చేశారు. ఎంఎల్ఏ పై తక్షణ చర్యల వల్ల జగన్ ప్రభుత్వానికి డ్యామేజి జరగకుండా జాగ్రత్తపడ్డారు.

 

కానీ ఎంతకాలం ఇలా కంటిన్యు అవుతారు కోటంరెడ్డి ? కాబట్టి దూకుడుతో పాటు వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందే. లేకపోతే వ్యక్తిగతంగా తాను నష్టపోవటమే కాకుండా పార్టీ ఇమేజిని కూడా దెబ్బతీసిన వారవుతారనటంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: