జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ, టీడీపీ నుంచి జూపూడి ప్రభాకర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ, వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన జూపూడి తిరిగి వైసీపీలో చేరారు.

 


ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ.. ‘టీడీపీకి రాజీనామా చేశా. నా వైపు నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకునేందుకే వైసీపీలో చేరాను. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్‌ది. ఫెడరల్ క్యాస్ట్రో పాలనలా జగన్ పాలన కొనసాగుతోంది. ఎలాంటి డిమాండ్లు లేకుండానే వైసీపీలో చేరాను. మంచి పరిపాలన కావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. కేబినెట్‌లో ఐదుగురు దళితులకు సీఎం జగన్ స్థానం కల్పించారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుంది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారు. సీఎం జగన్ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శం’ అని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు.

 


ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ జగన్ నెరవేరుస్తున్నారు. సీఎం చేస్తున్న మంచి పనుల్లో భాగస్వాములం కావాలని వైసీపీలో చేరా. మేనిఫెస్టోను పాలనకు గీటురాయిగా చేసుకున్నారు సీఎం జగన్. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు. కౌలు రైతులు కూడా రుణాలు, రైతు భరోసా వర్తింప చేశారు. వాహన మిత్రతో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలుపుకున్నారు. మద్యనిషేధంపై గతంలో చాలా మంది హామీ ఇచ్చారు.. సీఎం జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు.  వీరితో పాటు పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావు కూడా వైసీపీలో చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: