సీఎం వైఎస్ జగన్ కేబినెట్ లో తొలిసారి మంత్రులైన వారు చాలామంది ఉన్నారు. అందులో కొందరు మంచి పనితీరు కనబరుస్తుంటే...మరికొందరు పర్వాలేదనిపిస్తున్నారు. అయితే కొందరు ఇంకా సెట్ కాలేదు. ఈ మూడు కేటగిరీల్లో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పర్వాలేదనిపించేలా పాలన కొనసాగిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి కోట్ల సుజాతమ్మపై దాదాపు 40 వేల భారీ మెజారిటీతో గెలిచిన జయరాం...తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశంలో మొదలుపెట్టారు.


2001లో ఏదూరు గ్రామం నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2012లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఆలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి...జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.


అయితే ఆయన పదవి చేపట్టి నాలుగు నెలల దాటింది. ఈ నాలుగు నెలల సమయంలో జయరాం తన శాఖపై మంచి పట్టు సాధించుకున్నారు. అలాగే కార్మిక, ఉపాధి శాఖలకు సంబంధించి పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా జగన్ నేతృత్వంలో దాదాపు 53 వేల ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి సాహసోపేత మైన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రావడంలో ఆలస్యం జరగడంతో రాష్ట్రంలో కొంత ఇబ్బంది నెలకొంది.


అటు మొదట్లో ఇసుక అందుబాటు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇసుక కొత్త పాలసీ రూపొందించి అందించడంతో వారి ఇబ్బందులు ఇప్పుడుప్పుడే తొలుగుతున్నాయి. అలాగే తాజాగా ఆటో కార్మికులకు రూ.10 వేల చొప్పున సాయం చేశారు. ఈ పథకం ప్రతి ఏడాది కొనసాగనుంది. జయరాం మంత్రిగానే కాకుండా...ఆలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పలు సమస్యలని పరిష్కరించడంలో, అభివృద్ధి పనులు చేయడంలో ముందున్నారు. మొత్తం మీద ఈ నాలుగు నెలల కాలంలో  మంత్రిగా జయరాం పనితీరు పర్వాలేదనిపించేలా సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: