భారత్ లో వివిధ మార్గాల ద్వారా అక్రంగా, ప్రభుత్వ లెక్కలో చూపించని సంపాదనను దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గుట్టు చప్పుడు కాకుండా స్విస్ బ్యాంకులకు తరలించేసిన వైనంపై కథలు కథలుగా వింటూ ఉంటాము కదా. ఇప్పుడు ఆ కథలన్నీ బహిర్గతమైపోయే సమయం ఆసన్నమైపోయింది. నల్ల కుబేరులుగా మారి దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలించిన చాలా మంది పేర్లతో కూడిన జాబితా ఇప్పుడు మోదీ సర్కారు చేతికందింది అని సమాచారం. 


ఈ జాబితాలో భారత పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు కీలక వ్యక్తులతో పాటు విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలోని వ్యక్తుల వివరాలను పరిశీలించి చర్యలు తీసుకునేలోగానే వచ్చే సంవత్సరంలో రెండో జాబితా కూడా అందజేస్తామని స్విస్ అధికారులు చెబుతున్నారట. సరే ఇప్పటిదాకా స్విస్ నుంచి వివరాలు అందలేదని ఆ వివరాలు వస్తానే చర్యలు మొదలు అవుతాయని మోదీ సర్కారు చెబుతూ వస్తోంది. అలాంటి జాబితా ఇప్పుడు చేతికందన నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరింత ఆలస్యాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. మరి ప్రజల మనోభావాల మేరకు దేశ సంపదను దోచేసిన నల్ల కుబేరుల పనిబట్టే కార్యక్రమానికి మోదీ ఎప్పుడు మొదలు పెడుతారో ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.


భద్రతకు, గోప్యతకు మారుపేరుగా నిలిచే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డబ్బు బంగారం దాచుకోవడం ఇప్పటిది కాదు. అయితే స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు సరైన లెక్కలు చూపకపోతే అది నల్లధనం కిందే లెక్క ఇలాంటి ఖాతాలు చాలానే ఉన్నట్టు గత ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించినా ఆ నల్లధనాన్ని స్వదేశానికి చేర్చే ప్రక్రియ మోదీ హయాంలో జోరందుకొంది.


ఇక తాజాగా స్విస్ బ్యాంకుల్లో తమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం భారత్ కు అందినది మొదటి జాబితాగా అనుకుంటున్నారు. ఈ జాబితాలో అనేకమంది వ్యాపారవేత్తలు, ఎన్నారైలు ఉన్నట్టు గుర్తించారు. 2018లో అనేకమంది తమ ఖాతాలు మూసివేసినట్టు తాజా జాబితా ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి తొలి జాబితా అందించామని వచ్చే ఏడాది మరికొందరి పేర్లతో తదుపరి జాబితా అందజేస్తామని స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: