తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)  ఎందుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గణాంకాలతో సహా ఆయన  స్పష్టం చేస్తున్నారు. ఏటా రూ.240 కోట్ల పన్ను వేస్తూ.. రూ.700 కోట్ల నష్టం అని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఆర్టీసీకి ఉన్న అప్పులు రూ.300 కోట్లు. సంస్థకు ఏడాదికి వస్తున్న నష్టం రూ.700 కోట్లు. మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి ఆర్టీసీ ఏటా సరాసరి రూ.200 కోట్లు చెల్లిస్తోంది. ప్రస్తుతం అది రూ.240 కోట్లకు చేరుకుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేళ్లలో ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించిన పన్నుల మొత్తం రూ.1200 కోట్లకు పైమాటే. మరి..ఆర్టీసీపై పన్ను వేయడం సరైన చర్యేనా? ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాలపై వేయొచ్చు గానీ... ఆర్టీసీ బస్సులపై ట్యాక్స్ వేస్తారా? పాఠశాలలపై పెట్టే ఖర్చు (పబ్లిక్ ఎడ్యుకేషన్) మీద పన్నులు వేయట్లేదు. ప్రజా ఆరోగ్యం విషయంలో చేసే ఖర్చులపై పన్నులు వేస్తున్నారా? ప్రభుత్వ ఆస్పత్రులపై ట్యాక్స్‌లు వేస్తున్నారా అని నిలదీశారు.



ఆర్టీసీ అనేది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు.. అంటే ఇది కూడా ప్రజా సదుపాయం. ప్రజలకు సదుపాయం కల్పించే ఆర్టీసీపై పన్ను వేయడం సరికాదు . 
లాభ మొచ్చే రూట్లలో బస్సులు నడిపితే ట్యాక్స్ వేసినా ఏదో అనుకోవచ్చు.. కానీ, నష్టాలు వచ్చే అనేక రూట్లలోనూ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది.  గ్రామీణ ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజీల్‌పై ఏటా విధిస్తున్న పన్ను రూ.516 కోట్లు. కేంద్రం ఎక్సైజ్, వ్యాట్ కలుపుకొని ఈ మొత్తం రూ.590 కోట్లు అవుతోంది. ఇందులో రూ. 200 కోట్లకు పైగా రాష్ట్రానికి తిరిగి వస్తుందన్నారు.  మోటార్ వెహికల్ ట్యాక్స్ రూ.240, ఇంధన ట్యాక్స్ రూ.590 లేకపోతే ఆర్టీసీకి ఏటా రూ.700 కోట్లకు పైగా మిగులు ఉంటుంది. .నష్టాలు లేకపోగా, లాభాలు ఉంటాయి. రైల్వేలను ప్రజా రవాణాగా గుర్తించి ట్యాక్సులు రద్దు చేసినప్పుడు... ఆర్టీసీకి రాయితీ ఎందుకు ఇవ్వరన్నారు



తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో డీజిల్ ధర రూ.40, ప్రస్తుతం రూ.70 పైనే ఉంది. అంటే పెరిగిన ఇంధన ధరల కారణంగా ఆర్టీసీకి కిలోమీటర్‌కు 5 రూపాయల చొప్పున అదనంగా ఖర్చవుతోంది. ఆర్టీసీ బస్సులు రోజుకు సరాసరి 36 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. అంటే ఈ లెక్కన రోజుకు కోటీ 80 లక్షల రూపాయల నష్టం వస్తోంది. డీజిల్ ధరలు పెరగడానికి ఆర్టీసీ యాజమాన్యమో, ఉద్యోగులో బాధ్యులన్నారు.  పైగా మన దగ్గర అంతర్జాతీయ మార్కెట్ రేట్ల కంటే అధికంగా డీజిల్, పెట్రోలు ధరలు ఉన్నాయి.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే కారణమన్నారు.ఆర్టీసీ కొనుగోలు చేసే విడి భాగాలపై ఏటా రూ.100 జీఎస్టీ భారం పడుతోంది. టైర్లు, ఇతర వాహన భాగాల కొనుగోళ్లపై విధించే పన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే చేరుతోంది. ఇక కొరియర్ ట్రాన్స్‌పోర్టు, అన్ని రకాల వస్తువుల రవాణా ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు.



ఇలా ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడానికి అనేక మార్గాలు అన్వేషించవచ్చని నాగేశ్వర్ సూచిస్తున్నారు. ఇదిలా  ఉండగా అక్టోబర్ 9 ఉదయం10 :30  గంటలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో టీఎస్ ఆర్టీసీ జేఏసీ  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా  అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేషానికి అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించినట్టు అశ్వథామ రెడ్డి తెలిపారు. అదేవిధంగా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఈ సభకు హాజరు కావలసిందిగా ఆయన కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: