కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ కాంగ్రెస్ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటానికి కారణం పార్టీ వైఫల్యాలను గుర్తించటంలో జరిగిన జాప్యమేనని అన్నారు. ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందటానికి గల కారణాలను ఎన్నికలు పూర్తయిన నాలుగు నెలల తరువాత కూడా పార్టీ గుర్తించలేకపోయిందని ఖుర్షిద్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఖుర్షిద్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా రెండు నెలల క్రితం సోనియా గాంధీని నియమించుకోవటం జరిగిందని చెప్పారు.
 
కానీ పూర్తి స్థాయి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఖుర్షిద్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండాల్సిందని కానీ రాహుల్ గాంధీ వీటన్నింటికీ దూరంగా ఉంటున్నాడని ఖుర్షిద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద సమస్య సరైన నాయకుడు లేకపోవడమే అని అన్నారు. ఖుర్షిద్ సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగానే భావిస్తున్నానని అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్ష పదవిలో ఎవరూ లేకపోవటం వలన రానున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవటం కష్టమవుతుందని ఖుర్షిద్ అన్నారు. ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: