ఆర్టీసీ కార్మికులు సమ్మె నుండి వెనక్కు తగ్గే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం డ్రైవర్లు, కండక్టర్ల కొరకు ఆర్టీసీలో నియామకం మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సునీల్ శర్మ, రవాణాశాఖ అధికారులు భవిష్యత్ కార్యాచరణ గురించి ఆర్టీసీకి చెందిన అధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. డిపో మేనేజర్లు, రవాణాశాఖ అధికారులతో సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేట్ పరం చేస్తే ఎంతమంది కార్మికులను నియమించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రవాణాశాఖ అధికారులు బస్సులు నడిపేందుకు పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల యాజమాన్యాలు ముందుకు వస్తున్నాయని చెబుతున్నారు. ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు సమ్మె చేయకుండా అధికారులు భద్రత పెంచారని తెలుస్తోంది. 
 
ఈరోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విపక్షాలు ఈ సమావేశానికి హాజరై సమ్మెకు తమ మద్ధతు తెలిపాయి. న్యాయపరంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై జేఏసీ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె సంస్థను కాపాడుకోవటానికి మాత్రమేనని జీతభత్యాల కొరకు కాదని అన్నారు. 
 
గడచిన ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీలో కొత్త నియామకాలు జరగలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రజలు అర్థం చేసుకోవాలని సమ్మెకు సహకరించాలని అశ్వత్థామ రెడ్డి కోరారు. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని ప్రజలు సమ్మెకు సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నారని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీలో కేవలం 1200 మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: