చట్టాలు కఠినతరం చేసినా ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. అరుదైన ఎర్రచందనం వృక్షాలు స్మగ్లర్ల గొడ్డలివేటుకు బలవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం శేషాచల అడవుల్లో స్థానిక స్మగ్లర్ల హవా కొనసాగుతోంది. తాజాగా చంద్రగిరి మండలం కళ్యాణ డ్యామ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో తిరుపతికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు పట్టుపడగా... మరో ముగ్గురు తప్పించుకున్నారు.


పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడం లేదు. గుట్టుగా సాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యామ్ సమీపంలోని రాగిమాకులకుంట వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు స్మగ్లర్లు ఆరు ఎర్రచందనం దుంగలను ఆటోలో లోడ్ చేస్తుండగా పట్టుబడ్డారు. 


పట్టుబడిన స్మగ్లర్లు తిరుపతికి చెందిన రాపూరు ప్రేమ్‌కుమార్, సూర్యనారాయణగా గుర్తించారు. నిందితులను విచారించగా మరో ముగ్గురు కూడా దుంగలను మోసుకోస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే.. టాస్క్‌ఫోర్స్‌ అధికారుల రాకను పసిగట్టిన ముగ్గురు స్మగ్లర్లు దుంగలను అక్కడే వదలి అడవిలోకి పారిపోయారు. మరో ఆరు దుంగలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పరారైన స్మగ్లర్ల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఎవరైనా సరే ఎర్ర చందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పోలీసులు అటు ఫారెస్ట్ అధికారులు నిరంతరం అడవులపై కన్నేసి ఉంచుతారు. అటవీ సంపదను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పెడుతూనే ఉంటారు. కానీ స్మగ్లింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. పోలీసులు, అధికారుల కళ్లు గప్పి స్మగ్లర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. ఎక్కడో ఒకదగ్గర మాత్రం దొరికిపోతూ కటకటాల పాలవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: