హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోరు తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు.. హుజూర్‌నగర్‌లో విజయం కోసం స్టార్‌ క్యాంపెయినర్స్‌తో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. 


హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే పోటాపోటీ ప్రచారాలతో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు.. ప్రచారానికి ముగింపు గడువు మరో 8 రోజులే ఉండటంతో గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయించి విజయం సాధించాలని ప్లాన్‌ చేస్తున్నాయి. గత నెల 30న ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌లోని పబ్లిక్‌ క్లబ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించారు. దీనికి అగ్రనేతలందరూ హాజరై.. పద్మావతికి మద్దతుగా సభను సక్సెస్ చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరేడుచర్ల మండలంలో పద్మావతిరెడ్డితోపాటు ప్రచారం నిర్వహించారు.


ఇటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ.. ఈనెల 4న కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఉప ఎన్నిక కోసం పెద్ద సంఖ్యలో ఇన్‌ఛార్జ్‌లను నియమించిన అధికార పార్టీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే నియోజకవర్గానికే మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, సత్యవతి రాథోడ్‌ లాంటి నేతలు పరిమితమై.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 


పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. హుజూర్‌నగర్ బై ఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ అభ్యర్థి కోట రామారావుకు మద్దతుగా నేటి నుంచి 18వ తేదీ వరకు కె.లక్ష్మణ్‌, జాతీయ నాయకులు మురళీధర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వంటి అ్రగ నాయకులు ప్రచారం చేయనున్నారు. ఇటు టీడీపీ నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌గా నందమూరి బాలకృష్ణ ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులు కూడా చావా కిరణ్మయి తరఫున ప్రచారం చేయనున్నారు. అంతేకాదు.. ఎల్‌.రమణ, అరవింద కుమార్‌గౌడ్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనన్నారు. 


నేటి నుంచి వారం పాటు సినీ నటి విజయశాంతి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, వీహెచ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్‌ నాయకులందరూ పద్మావతి తరపున ప్రచారం చేయనున్నారు. టీపీసీసీలోని ముఖ్యనేతలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. రేపు కేటీఆర్‌ జాన్‌పహాడ్‌, పాలకీడు, నేరేడుచర్ల పట్టణం మండలాలు, 12న చింతలపాలెం, చింతలపాలెం రూరల్‌, మేళ్లచెర్వు, మేళ్లచెర్వు రూరల్‌లో ప్రచారం చేయనున్నారు. 13న మట్టపల్లి దేవస్థానంలో పూజలు చేసిన అనంతరం పెదవీడు, మఠంపల్లి, ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. చివరిగా ప్రచారాల ముగింపు రోజు సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న ఉపఎన్నికపై అన్ని పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి. అందుకే 7 మండలాల్లో స్టార్ క్యాంపెయినర్లతో రోడ్‌షోలు, బహిరంగసభలు ఏర్పాటు చేయబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: