టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా రూపొందిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇటీవల గాంధీ జయంతి కానుకగా రిలీజ్ అయి ప్రస్తుతం యావరేజ్ టాక్ తో మెల్లగా ముందుకు సాగుతోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, అనుష్క శెట్టి, తమన్నా వంటి దిగ్గజ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. 

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓవర్ ఆల్ గా యావరేజ్ టాక్ ని సంపాదించినప్పటికీ, సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ నటనకు ప్రేక్షకులు సహా పలువురు సినిమా రంగ ప్రముఖులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నిన్న వీక్షించి మెచ్చుకోగా, అతి త్వరలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా వీక్షించనున్నట్లు సమాచారం. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ప్రత్యేకంగా ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలవనున్నారు. 

ఈమేరకు ఆయన అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం కార్యాలయం వారు శుక్రవారం సిఎం గారిని కలిసే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అయితే వారి ఈ ప్రత్యేక కలయికలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, ‘సైరా’ చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకుగాను కృతఙ్ఞతలు తెలిపి, అలానే ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా సినిమాను వీక్షించేందుకు ఆహ్వానించడానికే ఈ మీటింగ్ అని ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. కాగా మెగాస్టార్ మరియు ఆయన తనయుడు రామ్ చరణ్, జగన్ గారిని కలవబోతుండడం ప్రస్తుతం సినీ మరియు రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: