అతివేగం ప్రమాదకరం...అతి వేగం కాదు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా చాలు డైరెక్ట్ నరకం ఎంట్రీ బోర్డు చేరుకోవచ్చు.ఈ రోజుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకి..  రోడ్డెక్కితే భద్రంగా ఇంటికి చేరతామో లేదోనన్న భయం ఉండనే ఉంది.ఎలాగోలా రోడ్డెక్కినా క్షణక్షణం గుండె దడ.. ఆక్సిడెంట్ ఈ కానక్కర్లేదు  ఏ గుంతలో పడ్డా  బైక్ ఫట్టమంటుంది.. బైక్ కింద పడి ఒంట్లో బొక్కలు విరుగుతున్నాయి.20 కిలోమీటర్ల వేగానికి మించి వెళితే చాలు డైరెక్ట్ నరకానికి దారులు వెతుక్కున్నట్లే.

ఎక్కడనుకుంటున్నారా?ఇంకెక్కడ హైటెక్కు సిటీ ..... మెట్రో సిటీ అని చెప్పుకుంటున్నాం కదా.....హైదరాబాద్ రోడ్లే ఇప్పుడిట్టా ఉన్నాయి.రోడ్డెక్కగానే భారీ గుంతలు, పెద్ద పెద్ద గొయ్యిలు, ఎత్తుపల్లలతో డాన్స్ రాకున్నా కూచిపూడి, కథకళి, డిస్కో.... అన్ని ఒక్కసారే చేయుస్త్యున్నయు నగరంలోని రోడ్లు.ఈత కొట్టే దమ్ముంటే ఆ గుంతల్లో పడి ఎంచక్కా ఈదుకుంటూ కూర్చోవచ్చు. మురికి కాలువల్లో నిండిన నీళ్లు రోడ్లను అభిషేకం చేస్తూంటే ఆహ.....ఆ కంపు నాసికానందభరితం.మొన్న కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లన్నీ ఇంత దారుణంగా తయారయ్యాయి.


ఇంటి నుంచి బైక్ తీసుకొని వెళ్తే.. భద్రంగా ఇంటికి చేరుతామో, లేక గుంతల్లో పడి మంచం ఎక్కుతామో తెలీకుండా పోయాయి. ఈ రోడ్ల మీద వెళ్లే బైకు పార్టులన్నీ ఒక్కొక్కటిగా ఇనప సామాను కొట్టుకి చేరుకుంటున్నాయి.ఇక కార్లలో వెళితే..మరీ ఘోరం... నాలుగు టైర్లు నాలుగు రకాలుగా నృత్యం చేస్తున్నాయి.బైక్‌పై వెళ్తే.. ప్రస్తుతం ఉన్న రోడ్ల వల్ల నడ్డి విరుగుతోంది. వెన్నుపూసలు ఫట్‌ఫట్‌మంటున్నాయి. ఇక ముసలివాళ్లైతే ఒకసారి బయటికి వెళ్తే.. ఇంటికి వచ్చి మంచం పట్టాల్సి వస్తోంది మరి. కుండపోతగా కురుస్తున్న వర్షాలు రోడ్లను పనికిరాకుండా చేస్తున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుందామన్నా వర్షాలు ఆ అవకాశం ఇవ్వడం లేదు.


అప్పుడే భగభగమండే ఎండ పోయి.. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొంటున్నాయి. మరు క్షణమే.. వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏదేమైనా జీహెచ్‌ఎంసీ త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే నగరవాసులు త్వరలోనే మంచాన పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.కాగా, వరుసగా వర్షాలు కురవడంతో పలు మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, 160కి పైగా మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల రోడ్ల మరమ్మతులకు ఆటంకం కలుగుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ చెప్పారు. వర్షాలు తగ్గాక యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపడతామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: