తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఆర్టీసీ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఇప్ప‌టికే వివిధ పార్టీలు, ప్ర‌జా సంఘాలు స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లికాయి. హై కోర్డులో కూడా కేసు విచార‌ణ జ‌రుగుతోంది. మ‌రోప‌క్క ఈ అంశంపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిప్ర‌క్షాల‌న్నీ సిద్ధ‌మ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ గురువారం  రాజ్ భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.


తెలంగాణలో మరో ఉద్యమం తప్పేలా లేదని, కేసీఆర్‌ అగ్గితో గోక్కుంటున్నాడని ఈసంద‌ర్భంగా లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ నాణ్యమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతేగాక 50 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగించామని పేర్కొనడం బాధాకరమని ఆయ‌న అన్నారు.  ప్రజల బాధలు కేసీఆర్‌కు పట్టడం లేదని, తె లంగాణ ఆస్తులను తన ఆస్తులుగా కూడబెట్టే ప్రయత్నంలో కేసీఆర్‌ నిమగ్నమై పోయారని లక్ష్మణ్ విమర్శించారు.


అయితే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న డిమాండ్లు కొత్తవేం కాదని, తెలంగాణ రాకముందు కేసీఆర్‌ కూడా ఈ డిమాండ్లు చేశారని లక్ష్మణ్‌ గుర్తు చేశారు.  పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని కేసీఆర్‌ అప్పట్లో అన్నారని పునరుద్ఘాటించారు. మానవత్వం లేకుండా ఆర్టీసీ హాస్పిటల్లో సేవలను ఆపేశారని మండి పడ్డారు. ప్రజలందరిని ఏకం చేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని, ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత గవర్నర్‌పై ఉందని లక్ష్మణ్‌ తెలిపారు.  


అంతేగాక ఆర్టీసీ సమ్మెపై తమ వాదన పట్ల గవర్నర్‌ సాను కూలంగా స్పందించారని లక్ష్మణ్‌ తెలిపారు. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్న ఆర్టీసీ స‌మ్మెపై గ‌ర‌ర్న‌ర్ ఏ విధంగా స్పందిస్తార‌నే ది ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: