గురువారం జలవిహార్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి అలయ్ బలయ్ వేడుకలు ప్రతీకని, అన్ని వర్గాలు సామరస్యంగా జీవించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.  కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలంగాణ గవర్నర్ తమిళిసైపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజా సమస్యలపై గవర్నర్‌ను కలవాలని తాము ఎంతగా ప్రయత్నిస్తున్నా... వీలుపడటం లేదని తమిళిసై సమక్షంలోనే ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న గవర్నర్‌ తమకు సమస్యలు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదని పరోక్షంగా అప్పటి గవర్నర్ నరసింహన్ తీరును తప్పుబట్టారు. మీరు అలా చేయొద్దని... తమకు సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇక అలయ్ బలయ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకుల బొమ్మలు లేకపోవడాన్ని కూడా వీహెచ్ తప్పుబట్టారు.

పార్టీలకు అతీతంగా దత్తాత్రేయ నిర్వహించే ఈ కార్యక్రమంలో తమ ఫోటోలు కూడా పెట్టాలని ఆయన నిర్వాహకులను కోరారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తరువాత దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో లేదో అని తాను సందేహించానని... కానీ ఆయన మాత్రం తన ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ఈ కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వీహెచ్ వ్యాఖ్యానించారు.

కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ సీ హెచ్ విద్యాసాగర్ రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు కె కేశవరావు, రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశే్వశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఇంకా ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: