భాగ్య నగరంగా పిలవబడే హైదరాబాద్ నగరం నగర వాసులకు మాత్రం భార నగరంగానే కనిపిస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. నగరంలోని రోడ్లన్నీ బురదమయం కావటంతో నగరవాసులు నడవటానికి కూడా వీలు కుదరడం లేదు. మరోవైపు రోడ్లపై నీరు నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 
 
ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉండటంతో నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాలాలు పొంగి పొర్లుతుండగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. జీహ్ ఎచ్ ఎం సీ అధికారులు పలు ప్రాంతాలలో మ్యాన్ హోళ్లను తెరిచి నీటిని పంపిస్తూ ఉండటంతో కాలినడకన వెళ్లేవారు రోడ్లపై నడవడానికే భయపడుతున్నారు. 
 
వర్షాల వలన నగరంలోని ప్రజలకు విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు పరీక్షల పేరుతో రోగుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ నగరవాసుల అవసరాలకు తగినట్లు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే నగరవాసులు ఆటో, క్యాబ్ లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారికి ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉండటంతో ప్రయాణ కష్టాలు తీరటం లేదు. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ వాహనాలు రెచ్చిపోతున్నాయి. ఆటో ఛార్జీలను రెండు రెట్లు మూడు రెట్లు పెంచి ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. అత్యవసర సమయాల్లో వెళ్లాల్సిన జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. హైదరాబాద్ నగర వాసులు గతంలో ఎప్పుడూ హైదరాబాద్ నగరం ఇంత భారంగా లేదని సమ్మెతో, వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: