ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలను చూస్తుంటే సమాజం పయణం ఎటువైపు సాగుతుంది.  మంచివైపా...చెడువైపా. అన్న ప్రశ్నకు సమాధానం  అంతు చిక్కటం లేదు. మొత్తానికి నేటి  తరం మనిషిలో వింత మార్పు కన్పిస్తుంది. కలిసి మెలిసి తిరుగుతున్నా, కళ్లముందు రోజు మెదులుతున్న పరిచయస్తులను, దగ్గరి వారిని, చివరికి దైవంగా నమ్మిన వారిని సైతం దారుణంగా మోసం చేయడానికి కూడ వెనుకాడటం లేదు. ఈ పరిస్దితి అన్ని చోట్ల మనకు సృష్టంగా కనిపిస్తుంది. ఇక విద్యా బుద్దులు నేర్పేచోటు ఆలయంతో సమానమని నమ్ముతారు విద్యార్ధులు. అందులో చదువుచెప్పేవారికి ఓ ప్రత్యేకమైన స్దానాన్ని ఇచ్చి గొరవిస్తారు.


ఇలాంటి ప్రదేశాల్లో విద్య నేర్చుకునే వారికే వినయం, వివేకం అలవడుతుంటే, విద్యనేర్పే గురువులు, రోజు రోజుకు అజ్ఞాతంలోకి వెళ్లుతూ, సమాజం తలదించుకొనేలా ప్రవర్తిస్తున్నారు. గురువు అనే పదాన్ని గుదిబండలా తయారు చేస్తున్నారు. చదువుకుంటే విజ్ఞానవంతులుగా మారి, సంస్కారవంతమైన జీవన విధానాన్ని పాటిస్తారనుకుంటే సంస్కార హీనంగా మారుతున్నారు. విద్యార్థుల భవితకు పునాది వేయాల్సిన గురువులే వారి ధర్మాన్ని మరచి, పవిత్రమైన ముసుగులో చెప్పుకోలేని అరాచకాలకు పాల్పడు తున్నారు. ఇలాంటి వారివల్ల నైతికవిలువలు పతనమవుతున్నాయని చెప్పవచ్చూ.


ఇక గురువు అనే గౌరవప్రదమైన వృత్తికే కళంకం తెచ్చాడు ఓ మాస్టారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో తన ఫ్లాట్‌కు విద్యార్థినులను రప్పించుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.. ఇంతటి ఘనకార్యం జరుగుతున్నది ఓ విశ్వవిద్యాలయంలో. దాని పేరు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం. ఈ విశ్వ విద్యాలయంలో పని చేస్తున్న ఆ కీచకుడు చేస్తున్న పనికి బాదితులంతా ఇంతకాలం పాటు మౌనందాల్చారు. చివరకు ధైర్యం చేసి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే లేఖ రాశారు. లేఖ అందుకున్న ముఖ్యమంత్రి తక్షణమే విచారణకు ఆదేశించారు.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని రాజానగరం వద్ద నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో వర్సిటీ కావాలనే సంకల్పంతో నాడు ఈ వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వర్సిటీకి అనుబంధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాలేజీలు అన్నింటా కలిపి 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ వర్సిటీలో విద్యార్థినుల పట్ల అధ్యాపకుని లైంగిక వేధింపులపై  సహచర అధ్యాపకులెవరూ పెదవి విప్పడం లేదు.


ఇంగ్లిషు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్‌గా పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.సూర్యరాఘవేంద్ర ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలిచారు. చాలా కాలంగా ఈ వేధింపులున్నా భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో విద్యార్థునులెవరూ ముందుకు రాలేదు. వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సు చేస్తున్న కొంతమంది విద్యార్థినుల పాఠాలు అయిపోయాక స్పెషల్‌ క్లాసుల కోసమంటూ రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్‌కు రావాలని బలవంతం చేస్తున్నాడు.


తెగించి ఎవరైనా పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే  ప్రాజెక్టులు ఆపేస్తా, పాస్‌ కాకుండా చేస్తాననే బెదిరింపులతో విద్యార్థినులు పెదవి విప్పలేని పరిస్థితి. కాని రోజు రోజుకు అతని వేధింపులు తట్టుకోలేక ధైర్యం చేసి కొందరు విద్యార్దులు ఈ ఘటనను బట్టబయలు చేసారు. ఇంతకు ముందు ఇతని కీచకత్వానికి ఎంతమంది అమాయకురాల్లు బలైపోయారో.  ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, కామంతో రగిలే ఇటువంటి కామాంధులను తగిన రీతిలో శిక్షిస్తేగాని మిగతా వారికి కనువిప్పు కలుగదని  ఎందరో విద్యార్దినిలు కోరుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: