పవన్ కల్యాణ్‌.. ఆయన ప్రసంగంలో ఆవేశం ఉంటుంది. ఓ తపన కనిపిస్తుంది. అప్పుడప్పుడూ కామెడీ కూడా ఉంటుంది. కానీ తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధోరణిలో ప్రసంగించారు. హరిద్వార్ లోని పవన్ సదన్ ఆశ్రమంలో జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంతకీ ఈ అగర్వార్ ఎవరు అంటారా..?


గంగా ప్రక్షాళన కోసం 111 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేసిన సామాజిక కార్యకర్త జి.డి. అగర్వాల్.. ఐఐటీలో విద్యాభ్యాసం చేశారు. ఉన్నత విద్యావంతులకు బోధన చేసిన గొప్ప జ్ఞాని. చివరి దశలో సన్యాసాన్ని స్వీకరించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సంస్మరణ సమావేశంలో పవన్ కల్యాణ్‌ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.


పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో.. ’’శరీరాన్ని నడిపించే ఆత్మ అత్యంత శక్తివంతమైనది. అగర్వాల్ తన దేహాన్ని వదిలి.. ఆత్మను ఇక్కడే వదిలి మరింత శక్తిమంతంగా తయారయ్యారు. ఆయన శక్తే నన్ను ఇక్కడికి వచ్చేలా మేల్కొలిపింది. అగర్వాల్ సందేశాన్ని యావత్ భారతదేశానికి చేర్చేందుకు అవసరమైన నా వంతు బాధ్యతను తప్పనిసరిగా నిర్వర్తిస్తాను. ఇది ఆయన ఆత్మశక్తి.. దీన్ని వృథాకానీయం అని అన్నారు.


దేశంలో రాజకీయాలు ఎన్నున్నా.. ఎందరు రాజకీయనాయకులు భావించినా.. దేశసాంస్కృతిక వైభవాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జి.డి.అగర్వాల్ వంటి సంత్‌ల కారణంగా.. అది ఎప్పటికీ భద్రమేనంటూ.. జర్మన్ తత్త్వవేత్త షెఫార్డ్ హావెన్సెన్ మాటలను ఉదహరించారు.’చాలామంది యూరోపియన్ వ్యక్తులు.. భారతదేశంలో ఓ నమ్మకాన్ని ప్రచారం చేయాలని భావించిన సందర్భంలో. తత్త్వవేత్త షెఫార్డ్ వారినుద్దేశించి. ’’భారతదేశం మీరనుకున్నట్లు ఎన్నటికీ మారదు.. పైగా అదే మీలో పరివర్తన తెస్తుంది’’ అని అన్నారు. అదీ భారతదేశపు శక్తి అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దేశంలో సాధుసంతులు ఉన్నారు.. వారు ప్రకృతి కోసం పోరాటాలూ చేస్తారు అన్న పవన్.. దేశాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి, స్థిరచిత్తంతో పోరాడిన జి.డి. అగర్వాల్ చూపిన మార్గం కొనసాగుతుందన్న భరోసా వ్యక్తం చేశారు.


అందరి సహకారంతో అగర్వాల్ ఆకాంక్షలు, ఆశయాలను భావి తరాలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని, దానికి విజ్ఞులు మార్గనిర్దేశకత్వం చేయాలని పవన్ కోరారు. రాజకీయాల్లో ఓ అడుగు ముందుకు వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చు.. అయితే ప్రొ.జి.డి.అగర్వాల్ త్యాగాన్ని గౌరవిస్తూ.. ఇప్పటికే ఉద్యమిస్తోన్న వారి సూచనలు, మార్గనిర్దేశకత్వంలో.. పోరాటాన్ని ముందుకు తీసుకు వెళతానని పవన్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: