విజయనగరానికి పండగ కళ వచ్చేసింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయనగర ఉత్సవాలు జరుగుతున్నాయి. నాలుగో రోజు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. దేశంలోనే ప్రత్యేకంగా సిరిమానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా నిర్వహిస్తోంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విజయనగరం ఉత్సవాలు ఇక్కడి సంస్కతీ, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా స్థానిక కళారూపాలు అలరించనున్నాయి. అందుగ్గాను వివిధ వేదికల వద్ద గట్టి ఏర్పాట్లనే చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది చిత్రలేఖనం, లఘుచిత్రాల పోటీలు, బాణాసంచా వెలుగులు అదనపు ఆకర్షణగా నిలువనున్నాయి. ఉత్సవాల ప్రారంభ రోజైన 12వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ పైడితల్లమ్మ ఆలయం నుంచి -  ఆనందగజపతి కళాక్షేత్రం వరకూ వివిధ కళారూపాలతో ర్యాలీ ఉంటుందని., ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందిన ప్రముఖులు, మేథా వులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ సభలో జిల్లాకు చెందిన 15 మంది ప్రముఖులను సన్మానించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇదే వేదిక వద్ద మధ్యాహ్నం  2.00 గంటల నుంచి సంస్కృత కళాశాల వద్ద ప్రాచీన ప్రాచ్య గ్రంథ ప్రదర్శన, అష్టావధానం, కవి సమ్మేళనం, సాంస్కృతిక వారసత్వంపై క్విజ్‌ పోటీలు, పుస్తక ప్రదర్శన నిర్వహిస్తారు. మిగిలిన రెండు రోజులు కూడా ఇది కొనసాగుతుంది.  మహారాజ కోట వద్ద సైన్స్‌ ఫేర్, ఫొటో ఎగ్జిబిషన్, పెయింటింగ్‌ ఎగ్జిబిషన్, స్టాంప్స్‌ ఎగ్జిబిషన్, హస్తకళ ప్రదర్శన ఉంటుంది. రెండో రోజు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఉదయం 10 గంటలకు పుష్ప ఫల ప్రదర్శన ప్రారంభంమై, మిగిలిన రెండురోజులూ కొనసాగుతుంది. టీటీడీ కల్యాణ మండపం వద్ద రోజూ సాయంత్రం 6 గంటల నుంచి భక్తి సంగీతం, హరికథలు, భజనా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గురజాడ కళాభారతిలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఏకపాత్రాభినయాలు, నాటికలు ఉంటాయి. రెండో రోజైన 13న అదనంగా ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు క్రీడా పోటీలు జరుగుతాయి. రాజీవ్‌ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు వివిధ క్రీడా పోటీలు, అయోధ్యా మైదానంలో ఉదయం 9 గంటల నుంచి స్త్రీలకు ముగ్గుల పోటీలు, సాయంత్రం 4 గంటలకు పెట్‌ షో, డాగ్‌ షో ఉంటాయి. కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్లో ఉదయం 10 గంటల నుంచి హరిత విజయనగరంపై లఘు చలనచిత్రాల ప్రదర్శన ఉంటుంది. జానపద కళలకు సైతం ప్రత్యేక నిర్వహణ చేపట్టారు.

ప్రతి ఏడాది అయోధ్యా మైదానం లో నిర్వహించే కార్యక్రమాలను ఈ ఏడాది నిర్వహించడం లేదు. ఆ లోటు లేకుండా గతేడాది కంటే మిన్నగా అత్యంత వైభవంగా విజయనగర ఉత్సవాలను, పైడితల్లి జాతరను నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: