హెచ్ ఐ సీ సీలో నిర్వహించిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రపంచ డిజైన్ రంగానికి కేంద్రం కాబోతుందని కేటీఆర్ అన్నారు. యానిమేషన్, ఫ్యాషన్, టూరిజం, హస్త కళలు మొదలైన రంగాల్లో హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వివిధ సంస్థలతో కలిసి ఔత్సాహికులను ప్రోత్సహించటం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 
 
ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిని చాటి చెప్పే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగిందని కేటీయార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత నుంచి సీఐఐ వంటి సంస్థలతో కలిసి హైదరాబాద్ డిజైన్ వీక్ లో వినూత్న ఆలోచనలను సేకరించామని కేటీఆర్ చెప్పారు. డిజైనింగ్ ప్రాముఖ్యతను చాటేలా హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన అంశాలు చిరకాలం నిలిచిపోయే విధంగా రూపొందించామని కేటీఆర్ అన్నారు. 
 
హైదరాబాద్ వినూత్న ప్రాజెక్ట్ ల హబ్ గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్ర డిజైనింగ్ నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికలపై తెలియజేయాలని ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రపంచ డిజైన్ రంగంలో కలిసేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. డిజైన్ రంగంలో అవకాశాల్ని కల్పించటం ద్వారా మంచి ఫలితాలు సాధించటానికి ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నామని అన్నారు. 
 
గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ నగరాన్ని మార్చటంలో అందరి సహకారం కోరుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరు కంటే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. హైదరాబాద్ నగరంలో టీ హబ్, ఇమేజ్ టవర్స్, టీవర్క్స్ నిర్మాణం జరుగుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ ఆసు యంత్రాలను అందజేశారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: