రాష్ట్రపాలనకు కార్యాలయంగా మారిన  బీఆర్కేఆర్ భవనానం లోకి జర్నలిస్టుల రాకపోకలపై ఆంక్షలు విధించడం అంటే ప్రజాస్వామ్యంపై ఆంక్షలు విధించడమే. అవినీతి, అక్రమాలను వెలికితీసే మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమే. కేసీఆర్‌ నియంతృత్వ ఆలోచనలకు ఈ చర్య అద్దం పడుతుంది’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే సీఎస్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని కోరారు.  


తాత్కాలిక సచివాలయంలోకి జర్నలిస్టులను అనుమతించక పోవడంపై శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ ప్రధాన ద్వారం ఎదుట వివిధ మీడియా సంస్థలకు చెందిన విలేకరులు మౌన ప్రదర్శన చేశారు. కొత్తగా నిర్మించే సచివాలయంలోకి భవిష్యత్తులో జర్నలిస్టుల ప్రవేశాన్ని నిరోధించాలనే ముందస్తు ఆలోచనతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. 


అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో జర్నలిస్టులు సమావేశమై.. సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.  స్వేచ్ఛగా వార్తలు సేకరించేందుకు అనుమతించాలని వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై ఆంక్షలు ప్రభుత్వ నిర్ణయమని, ఆ విషయంలో తాను ఏమీ చేయలేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్పష్టం చేశారు.జర్నలిస్టులను ఆపడానికి నేనెవరిని? నేను ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే! మీడియాను అనుమతించవద్దని ప్రభుత్వమే చెప్పింది. దాన్నే అమలు చేస్తున్నాం’’ అని తేల్చి చెప్పారు. ఈ  నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో తీసుకున్నారని, సీఎం సీపీఆర్వో ద్వారా వార్తలను సేకరించాలని సీఎస్‌ సలహా ఇచ్చారు.


సీఎం సీపీఆర్వో కేవలం సీఎంవోకే పరిమితమని, సచివాలయంలో వార్తల సేకరణతో వారికెలాంటి సంబంధం లేదని జర్నలిస్టులు తెలిపారు. సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్‌ను సంప్రదించాలని సీఎస్‌ సూచించడంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాలకులు ఈ తరహాలో వ్యవహరించలేదని జర్నలిస్టులు నిరసన తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో తాము ముందు వరుసలో ఉన్నామని, ఆ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించడం సరికాదన్నారు.  జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు విధించిన అంశాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: