అధికారమధం నెత్తినెక్కిన కళ్ళకు యాధార్ధం కనిపించదని అంటారు పెద్దలు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నడో మరచిపోయారు. టిఎస్-ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఉన్నత స్థాయి సమావేశం అంటూ రెండు రోజుల పాటు గంటల తరబడి జరిగింది. చివరకు కేసీఆర్‌- సమ్మె లో ఉన్నవారందరూ ఉద్యోగాలు కోల్పోయారని నిర్ద్వంధంగా ప్రకటించారు. 


నిజానికి అధికారులతో అన్ని గంటలపాటు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించటానికి బదులు టిఎస్-ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులతో స్వల్పకాల సమావేశమైనా జరిపి  తనదైన సహజ ధోరణిలో నాలుగు మంచి మాటలు చెప్ప ప్రయత్నించినా సమస్య పరిష్కారం అయ్యేది. తెలంగాణ ఉద్యమంలో ఒక నాయకుడిగా ఎదిగిన ఒక ఆర్టీసీ ఉద్యోగుల నాయకుడు సమ్మెకు పిలుపునిస్తే ముఖ్యమంత్రినైన నేను మెట్టు దిగటమా? అన్న అహంకార ధోరణితో తలతిక్కగా ప్రవర్తించటంవల్లే ఈ సమస్య ఇంత క్లిష్టతర మైందని ప్రజలు ప్రతిపక్షాల వాదన. 


"పరికరాలతో పోట్లాడెవాడు పనులు చేయలేడు" - గత చరిత్ర చెప్పేదేమంటే ప్రభుత్వ ఉద్యోగులతో శత్రుత్వం పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రీ రాజకీయంగా తీరం దాటిన సందర్భాలు లేవు. ఉదాహరణకు తమిళనాడు దివంగత అధినేత్రి పురిచ్చితలైవి జయలలిత చాలు ఉదాహరణగా చెప్పుకోవటానికి. న్యాయవ్యవస్థల మొట్టికాయలతో తల బొప్పి కట్టించుకున్నారు.


అధికారం పీఠం అధిష్టించిన తొలినాళ్ళలో ఉద్యోగులు అడగకపోయినా ఇంటరిం రిలీఫ్ ని 42 శాతంగా ప్రకటించిన కేసీఆర్‌, అయిదేళ్లు గడిచినా రెండో విడత తాత్కాలిక భృతిని చెల్లించలేక పోతున్నారు. అంటే ప్రతిపక్షాలు కూడబలుక్కొని అన్నట్లు రాష్ట్రం దివాలా తీసిందా? నిజమా? "తెలంగాణకు వస్తున్న ఆదాయం ముందు మిగతా రాష్ట్రాలు ఎందుకూ సరిపోలవు" అని డంబాలు పోయిన కేసీఆర్‌ కు మెలుకువ వచ్చి రాష్ట్ర ఆర్ధిక స్థితి అర్ధమై - ఇప్పుడు ఆర్థిక మాంద్యం అంటూ నెపం ఇతరులపై నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 


తెలంగాణ ఆదాయం ఆర్ధికమాంధ్యం వలననే తగ్గిపోతోందని అంతలేసి గొంతుతో గోల చేస్తున్నారు. దానికి మంత్రులు నాయకులు వంతపాడటం మరీ విచిత్రం. ఆర్ధిక మాంధ్యం ఒక్క తెలంగాణా సమస్య కాదని ప్రజల వాదన. అసలు తెలంగాణా సమస్య "ప్రభుత్వ దుబారా" "ఉన్ననాడు "బోకి బోర్లించుకుని లేని నాడు బిచ్చమెత్తు కునే తత్వం పాలకులకు పనికి రాదు" అని జనం గొంతెత్తి కేకలేస్తున్నారు. అభివృద్దిని మరచి సంక్షేమాలపై మాత్రమే దృష్టిపెట్టి అలవికాని హామీలు శక్తికిమించిన వాగ్ధానాలు గుప్పించి, దేశంలోనే కాదు ఈ విశ్వంలోనే మేము ఫష్ట్ అంటూ కోతలు కోస్తూ కుప్పిగంతులేసిన నాయకత్వం నేడు జనం ఆశించే వేళ చేతులెత్తేసే ప్రజల లో కేసీఆర్ పై విశ్వసనీయత అధఃపాతాళానికి పడిపోయిందని రాజకీయ వేత్తల విశ్లేషణ.

KCR and the Art of Killing the Opposition

రాజకీయ కేంద్రం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్‌లో కొత్తగా వస్తున్న విపరిణామాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటం మొదలవగా - తెలంగాణలో అధికారంలోకి రావాల నే ఏకైన లక్ష్యం తో పనిచేస్తున్న కేంద్రంలోని బీజేపి - విపక్ష శూన్యత ఆవరించిన తెలంగాణాలో అమాంతం టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తమపార్టీ ఎదిగి ఎకాయకీ రానున్న ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ధ్యేయంతో - వ్యూహంతో దిశానిర్ధేశం చేయటానికి ఇదే సరైన తరుణమని అమిత్‌ షా ఆలోచిస్తున్నవేళ ముంగిట్లో హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు జరగబోయే ఎన్నికలు వస్తున్నవేళ పరిస్థితులను వ్యూహాత్మకంగా మలుచుకోవటానికి డిల్లి నాయకత్వం సంసిద్ధమౌతుంది. ట్రైలర్ గా హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలో బలాబలాలను బేరీజ్ వేసుకొనే అవకాశం దానికి దొరికింది. 


ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలా ఉద్యోగులతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కూర్చుంటే, జాగృతం అవ్వకపోతే బీజేపి టీఆరెస్ పై ముప్పేట దాడి చేయటం ఖాయం అంటున్నారు రాజనీతిజ్ఞులు. 

హైదరాబాద్ నగర పాలక ఎన్నికల్లో టీఅరెస్ కు నగరవాసులు సున్నం పెట్టేది ఖాయంగా కనిపిస్తుంది. నగరంలో పాలన స్థంబించి చాలా కాలమైంది. నగర రహదారులు నరకలోకాన్ని తలపిస్తున్నాయి. సకల రోగాలకు నగరం నెలవైంది. ప్రజారవాణా, ప్రజా ఆరోగ్యం పూర్తిగా స్థంభించగా, విద్యారంగం ఇంకా దరిద్రమైంది. కనీసం సవ్యంగా విద్యార్ధుల పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.  డ్రైనేజ్ వ్యవస్థ ఆగమాగమై, చిన్నవర్షం వస్తేనే నగరం నదులై పారుతుంది నివాసాలు చెరువులౌతున్నాయి. నగరవాసి ప్రయాణంలో యముని మహిషపు గంటల వికృత నాదం వినిపిస్తుంది. 


ఈ దుష్ట పాలనకు చరమగీతం పాడటానికి - ఎన్నికలకై నిరీక్షిస్తున్న, హైదరాబాబు నగరవాసులు ఇప్పటికే కాస్మోపొలిటీషియన్లుగా ఎదిగి తమ నగరాన్ని ప్రపంచస్థాయి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధితో పోల్చుకుంటున్న వేళ - ముంగిట్లోకి ఎన్నికలొచ్చాయి. నగరంపై వచ్చే ఆదాయం అంటే జన ధనం ఏమైపోతుంది? ఇంత ఆదాయం వస్తున్నా నగరం నరకంలా ఎందుకు మారింది? అవినీతి, అక్రమాల ప్రాకారమైన ఈ నగరం ఎలా బాగుపడుతుంది? పురపాలక మంత్రి ప్రగల్బాల రాయుడై ఉత్తర కుమారుడుగా ప్రఙ్జలు పోతూ ఉండగా, నగర మేయర్ చేస్టలుడిగి నిర్వికారంగా మిగిపోయారు.  
  
  
  



మరింత సమాచారం తెలుసుకోండి: