తెలుగు రాష్ట్రాల్లో భూమా కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నంద్యాల పార్లమెంట్ రాజకీయాలను 35 సంవత్సరాలుగా శాసించిన ఈ కుటుంబం ఇప్పుడు వారసత్వ పోరులో నలిగిపోతోంది. దివంగత భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో మృతిచెందడంతో వారి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిల ప్రియ పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి మృతితో ఏకంగా మంత్రి అయిపోయారు. అతి తక్కువ వయసులోనే మంత్రి అవడంతో ఆమె ఆళ్లగడ్డ రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోయారు.


ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా భూమా వ‌ర్సెస్ గంగుల కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు భూమా కుటుంబం నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందుకు కారణం ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న బలమైన బంధువర్గం. ఇక చిన్న వయసులోనే ఎమ్మెల్యే.... మంత్రి అవడంతో అనుభవలేమితో అఖిల ప్రియ దగ్గరి బంధువులు అందరినీ దూరం చేసుకుంది. ఇప్పటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న భూమా నాగిరెడ్డి అన్నదమ్ములు ఇప్పుడు వేరుప‌డ్డారు.


అఖిలప్రియ సోదరుడు భూమానాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్‌ నాయుడు తీరునచ్చక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎక్కువశాతం బంధువర్గం అనుచరవర్గం భూమా కిశోర్‌రెడ్డి వెంట నడిచారు.  ఇంకా చెప్పాలంటే కిశోర్‌రెడ్డి తండ్రి భూమా భాస్కరరెడ్డి మరణించిన తరువాత భూమా నాగిరెడ్డి రాజకీయ అరంగేట్రం చేసాడుకదా.. మరి ఇప్పుడు తాము భూమా కిశోర్‌రెడ్డి వెంటనడిస్తే తప్పు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.


భూమా దంప‌తులు జీవించి  ఉన్నంత కాలం కిశోర్‌ను కూడా త‌మ వార‌సుల‌తో స‌మానంగా చూశారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి త‌న‌యుడికి వ‌య‌స్సు త‌క్కువ కావండంతో ఇప్పుడు కిశోర్‌ను ఈ కుటుంబం వార‌సుడిగా చూస్తే త‌ప్పేంట‌న్న ప్ర‌శ్న వ‌స్తోంది. మ‌రోవైపు అఖిల మాత్రం త‌న భ‌ర్త‌తో పాటు త‌న కుటుంబాన్ని ఎంక‌రేజ్ చేస్తోంది. ఆమె తీరు కూడా బంధువుల్లోనే చాలా మందికి న‌చ్చ‌డం లేదు. అఖిలప్రియ భర్త వ్యవహారం నచ్చని ఆమె మరో సోదరుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఆళ్లగడ్డ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: