తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజు కొనసాగింది. ప్రభుత్వం ఆర్టీసి కార్మిక సంఘాలతో ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసిన తరుణంలో.. సమ్మె ఉధృతం చేయాలని జేఏసీ నిర్ణయించింది. అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ జేఏసీ. రాష్ట్రవ్యాప్తంగా వంటవార్పు, ధర్నాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసింది. 


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు 9వ రోజూ కొనసాగాయి. మరోపక్క అన్ని కార్మిక సంఘాలు ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటించాయి.  సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు డిపోల ముందు ఆందోళనకు దిగారు.  9వరోజు రాష్ట్రంలో పలు పాంత్రాల్లో వంటవార్పు కార్యక్రమాలతో నిరసన తెలియజేశారు మహిళా కార్మికులు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఆర్టీసీ మహిళా కార్మికులు వంటావార్పు నిర్వహించారు. 


నిజామాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మహిళలు వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తంచేశారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ పోరాటం కొనసాగుతుందని మహిళలు హెచ్చరిస్తున్నారు.  


ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె తొమ్మిదో రోజు కొనసాగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా డిపోల ముందు కార్మికులు వంటావార్పు నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్ లు తీర్చేవరకు పోరాటం కొనసాగుతుందని కార్మికులు హెచ్చరించారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వంటావార్పు కార్యకమ్రాలు చేపట్టారు కార్మికులు. తెలంగాణ మంత్రి గంగుల  కమలాకర్‌ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు.


జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికులు ధర్నాలతో, వంటావార్పు కార్యక్రమాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల బంద్‌ కొనసాగింది. జిల్లాలోని మధిర డిపో నుంచి బస్సులను బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలను కార్మికులు అడ్డుకున్నారు. మొత్తానికి ఒకవైపు అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసి జేేఏసీ  నేతలు. అటు జిల్లాల్లో కూడా ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతంగా జరుగుతోంది



మరింత సమాచారం తెలుసుకోండి: