ముఖ్యమంత్రి  జగన్, మెగాస్టార్ చిరంజీవి ఈరోజు భేటీ కాబోతున్నారు. ఈ భేటీ ఒకసారి వాయిదా పడి ఈ రోజుకు కుదిరింది. టీతో ముగించాల్సిన మీటింగ్ కాస్తా లంచ్ దాకా వెళ్ళింది. దాంతో ఈ మీటింగ్ పట్ల అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినిమా వర్గాల్లోనూ కూడా ఆసక్తి పెరిగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి జగన్ భేటీలో ఏం మాట్లాడుకుంటారు, ఏ విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఇవన్నీ కూడా పెద్ద చర్చగా మారిపోయాయి.


ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి జగన్ తొలిసారి బహిరంగంగా కల్సింది మాత్రం సాక్షి మీడియా ఆవిర్భావం సమయంలో, ఇది 2008లో జరిగింది. నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రి. జగన్ పారిశ్రామికవేత్త‌, చిరంజీవి సినిమా నటుడు. అలా మొదటి పరిచయం తరువాత ఈ ఇద్దరూ అనూహ్యంగా 2009 ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వచ్చారు ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా గెలిచారు. తరువాత కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వస్తే చిరంజీవి అదే కాంగ్రెస్ లో చేరారు. ఇక చిన్నపాటి రాజకీయ యుధ్ధం కూడా ఈ ఇద్దరి మధ్యన జరిగింది. అయితే చిరంజీవిని జగన్ ఎన్నడూ విమర్శించలేదు. ఇక 2014 నాటికి త్రుటిలో ముఖ్యమంత్రి కావాల్సిన  జగన్ బలమైన విపక్ష నేతగా ఎదిగారు. చిరంజీవి రాజకీయాల నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుంటున్న సందర్భం అది.


మరో వైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన మూలంగా జగన్ కి రాజకీయంగా ఇబ్బంది ఎదురైంది.  మెగాస్టార్ కుటుంబం టీడీపీకి అనుకూలమ‌న్న భావన కూడా వచ్చింది. అయితే చిరంజీవి ఎన్నడూ రాజకీయాల ప్రస్తావన తేలేదు. తన రాజ్యసభ సభ్యత్వం పూర్తి కాగానే ఆయన సినిమాలవైపే ద్రుష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో తమ్ముడికి మద్దతు ఇస్తారని అంతా అనుకున్నా కూడా చిరంజీవి ఆ వైపు చూడలేదు. మొత్తానికి జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు.


ఇపుడు సైరా విజయంతో చిరంజీవి కూడా టాలీవుడ్ సిం హాసనం మీద కూర్చున్నారు.  ఇపుడు ఈ ఇద్దరి భేటీ పట్ల సర్వత్రా ఆసక్తిగా ఉంది. ఏం మాట్లాడుకుంటారు,  ఏం జరుగుతుంది అన్నది ఓ టాప్ హీరో సినిమా రిలీజ్  అన్నంత ఉత్కంఠగా ఉంది. మరి చూడాలి ఆ అరుదైన భేటీ తరువాత ముచ్చట్లు ఎలాగూ బయటకు వస్తాయికదా. అన్నట్లు ఈ భేటీ తరువాత జగన్ ఒక కీలకమైన అనౌన్స్ మెంట్  చేయబోతున్నారుట. అదే కర్నూల్ జిల్లాలో ఉయ్యాలాడ నరసింహారెడ్డికి స్మారక మందిరం ఏర్పాటు వంటి వాటిపైన ఆ నిర్ణయం ఉంటుంది అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: