రాజకీయ గండర గండడు కేసీయార్ అని అంటారు. ఆయన మొత్తం పొలిటికల్ లైఫ్ తీసుకుంటే ఇబ్బంది పడిన సంఘటనల కంటే ఎదురు నిలిచి గెలిచినవే ఎక్కువగా  ఉంటాయి. దానికి కారణం కేసీయార్ కచ్చితమైన అంచనాలు వేసి ముగ్గులోకి దిగడం. అలాగే ఆయన ఎవరూ రాదనుకున్న తెలంగాణాను సాధించేశారు. ఇపుడు కేసీయార్ రెండు సార్లు సీఎం సీట్లో కూర్చుని అధికారం అనుభవిస్తున్నా కూడా  దాని వెనక ఆయన చాణక్యం చాలా ఉంది.


అటువంటి రాజకీయ దురంధరుడికి ఇపుడు చిక్కులు వరసగా ఎదురవుతున్నాయి. చికాకు తెప్పిస్తున్నాయి. తెలంగాణాలో ఎదురులేని మొనగాడుగా ఉన్న కేసీయార్ని ఇపుడు ఎర్ర బస్సు గంగవెర్రులెక్కిస్తోంది. స్థిరంగా ఉండనీయడంలేదు. ఆర్టీసీ కార్మికుల సమస్య ఎటువైపు దారితీస్తుందో అన్న టెన్షన్ గులాబీబాస్ లో ఉంది. దానికి తోడు అన్నట్లుగా ఆత్మహత్యలు, గుండె ఆగిపోవడాలు కూడా  మొదలైపోయాయి. ఖమ్మంలోని బస్సు డ్రైవర్ శ్రీనివాసరెడ్డి బలిదానం కేసీయార్ సర్కార్ని పూర్తిగా డిఫెన్స్ లో నెట్టింది. సామాన్యజనంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే పోయేది కదా ఎందుకింత రచ్చ చేస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది.


అంటే టోటల్ గా జనాభిప్రాయం కేసీయార్ కి వ్యతిరేకంగా బిల్డప్ అవుతోంది. మిగతా సమస్యలు వేరు ఆర్టీసీ బస్సు అంటే సామాన్యుడు కూడా అందులో ఉంటాడు.  అది ప్రజా రవాణా మరి. కేసీయార్ ఈ సంగతిని గుర్తుపెట్టుకోకపోవడమే మొత్తం ఎపిసోడ్ లో రాంగ్ స్టెప్ అంటున్నారు. రేపటి రోజున బస్సులు ప్రైవేట్ చేస్తారన్న మాట కూడా సామాన్యులను ఆర్టీసీ కార్మికులకు చేరువ చేస్తోంది.


ఇదే సమయంలో జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద అందరి చూపు ఉంది. ఇక్కడ  సీపీఐకి కచ్చితంగా అయిదు వేల ఓట్లు ఉన్నాయి. ఆర్టీసీ సమ్మె క్రమంలో  టీయారెస్ కి మొదట ఇచ్చిన మద్దతు తీసేసుకుంటామని చాడా వెంకటరెడ్డి చెబుతున్నారు. అదే కనుక జరిగి తటస్థ ఓటర్లు ప్రభుత్వానికి యాంటీగా ఓట్లు వేస్తే మాత్రం హుజూర్ నగర్ ఫలితం తేడా కొడుతుంది. ఒక్క ఉప ఎన్నిక కదా అని కాదు,  అదే మొత్తం టీయారెస్ రాజకీయ భవితను  కూడా డిసైడ్ చేస్తుంది. అందువల్ల ఇపుడు గులాబీ పార్టీకి  ఎరుపు వెర్రెక్కిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: