మహారాష్ట్రలో  అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం జలగావ్, భండారాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై ద్వజమెత్తారు. అంతేకాదు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే.. 370, 35ఏ అధికరణలను తిరిగి తీసుకొస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచాలని ప్రతి పక్షాలకు సవాల్ విసిరారు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని, ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టంచేశారు.


అదీగాక జమ్ముకశ్మీర్ భారత్‌లో కేవలం కొంత భూభాగం మాత్రమే కాదని, భారతదేశానికి మకుటమని చెప్పారు. 40 ఏండ్లుగా అశాంతితో రగులుతున్న కశ్మీర్‌లో నాలుగు నెలల్లోనే సాధారణ పరిస్థితులను నెలకొల్పామని. ఏండ్లుగా వేర్పాటువాదం, ఉగ్రవాదంతో సతమతమైన కశ్మీర్‌లో పేదలు, మహిళలు, దళితులు, పీడిత వర్గాల అభివృద్ధికి చోటు ఉండేది కాదని చెప్పారు. జమ్ము, కశ్మీర్, లడఖ్‌లలో వాల్మీకీ సామాజిక వర్గ ప్రజలు కనీసం తమ హక్కులను కూడా పొందలేకపోయారన్నారు. వాల్మీకి సోదరులను హత్తుకునే భాగ్యం నాకు కలిగిందని ఈ రోజు నేను భగవాన్ వాల్మీకి ఎదుట శిరస్సు వంచి చెప్పగలను అని ప్రధాని పేర్కొన్నారు.


ఇక ప్రస్తుతం ప్రపంచం సవాళ్లతో కూడిన సమయాన్ని ఎదుర్కొంటున్నదని, అయితే ఈ సవాల్‌ను ఎదుర్కొనగల శక్తి భారత్‌కు ఉందని ప్రధాని పేర్కొన్నారు. అందుకు నిదర్శనంగా పాకిస్థాన్‌కు చెందిన చొరబాటుదారులు మన సైనికులను చంపుతుంటే యూపీఏ పాలనలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కానీ యురి, పుల్వామా ఉగ్రదాడుల అనంతరం తాము ఉగ్రస్థావరాలపై దాడులు జరిపించి ప్రతీకారం తీర్చుకున్నామని, ఇందుకు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసమే  కారణమని, పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు అది తమకు స్ఫూర్తినిస్తున్నదని పేర్కొన్నారు. ఇంతకు మునుపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని, తమ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 25 లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నదని ఈ సందర్భంగా తెలిపారు. ..



మరింత సమాచారం తెలుసుకోండి: