భయంకర తుఫాను హగిబిస్ బీభత్సానికి జపాన్ అతలాకుతలమవుతోంది. రాజధాని టోక్యోతో పాటు జపాన్ తీర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 250 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులతో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. తుఫాను ధాటికి ఇప్పటివరకు 18మంది మృతిచెందారు.


శక్తివంతమైన తుఫానుతో జపాన్‌  వణికిపోతోంది. 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో వచ్చిన హగిబిస్ టైఫూన్ జపాన్ ను అతలాకుతలం చేస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలో తరచూ భూకంపాల ప్రభావానికి లోనయ్యే జపాన్ ...ఈ టైఫూన్ ధాటికి విలవిల్లాడుతోంది. రాజధాని టోక్యోతో పాటు జపాన్ పసిఫిక్ తీర ప్రాంతంలో 80 సెం.మీ. వర్షపాతం, గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. కుండపోత వర్షం కురుస్తుండటంతో జపాన్ ప్రజాజీవితం అస్తవ్యస్తమయింది. తుఫాను బలపడే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


టైఫూన్ ధాటికి వాహనాలు బొమ్మల్లా ఎగిరిపడ్డాయి. భవనాలు పేకమేడల్లా కూలాయి. ఇళ్ల కప్పులు కాగితాల్లా ఎగిరిపోయాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు అమాంతం బోల్తా కొట్టాయి. టైఫూన్ హగిబిస్ రాజధాని టోక్యో వద్ద తీరాన్ని తాకడంతో నగరం అతలాకుతలమైంది. అంతకు ముందు ఇది ఇజు వద్ద తీరాన్ని తాకి టోక్యోను సమీపించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 60 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 48 గంటల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. ఫిలిప్పీన్స్ భాషలో హగిబిస్ అంటే వేగం అని అర్థం. 


తుఫాను వలన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. రైలు, విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. రగ్బీ ప్రపంచ కప్ మ్యాచ్‌ తో పాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని, రానున్న రెండు లేదా మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అత్యవసర ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. 


కేటగిరీ 5 టైఫూన్ గా కొనసాగుతున్న హగిబిస్ ధాటికి జపాన్ తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతోంది. టోక్యో, పరిసర ప్రాంతాల్లో 800 మిమీ వర్షపాతం నమోదవ్వొచ్చన్నది స్థానిక వాతావరణ సంస్థల అంచనా. దీంతో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ భయంతో జపనీయులు ముందుగానే నిత్యావసరాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో డిపార్ట్ మెంటల్  స్టోర్లు ఖాళీ అయ్యాయి.  అయితే తుఫాను విరుచుకుపడడానికి ముందు సముద్రంలో భూకంపం సంభవించింది. చిబా తీరానికి దగ్గర్లో సముద్రంలో 59.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 1958లో టోక్యో రీజియన్‌ పై విరుచుకుపడ్డ పెను తుఫాను వల్ల 1200 మందికి పైగా చనిపోయారు, దాదాపు 5 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి.


మరోపక్క సముద్రం అల్లకల్లోలంగా మారింది.. ఎగిసిపడుతున్న అలలకు తీరంలో లంగరు వేసిన బోట్లు తలకిందులయ్యాయి. తీరం కోతకు గురైంది. తీరప్రాంతంలోని పలు ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది.  కనగవా సిటీలోని షిరొయమా డ్యాం సహా పలుచోట్ల డ్యాంల గేట్లను ఎత్తి  నీటిని కిందికి వదులుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం 17 వేల మంది మిలటరీ ట్రూపులను  సిద్ధం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: