మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొన్నారు. విపక్షాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ను పునరుద్దరిస్తామని చెప్పగలరా? అని సవాల్ విసిరారు.


మహారాష్ట్రను మరో ఐదేళ్లు పాలించడానికి బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని ప్రధాని మోడీ కోరారు. జలగావ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని... జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను కొన్ని ప్రతిపక్ష పార్టీలు, నేతలు వ్యతిరేకించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుపై దాయాది పాకిస్థాన్ మాదిరిగానే విపక్షాలు కూడా మాట్లాడుతున్నాయని విమర్శించారు. విపక్షాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ను పునరుద్దరిస్తామని చెప్పగలవా? అని సవాల్ విసిరారు. 


కశ్మీర్ విషయంలో భారత వాదనను అన్ని ప్రపంచదేశాలూ సమర్దిస్తున్నాయని మోడీ తెలిపారు. మహారాష్ట్రలో ఉధృతంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రెండుచోట్ల, రాహుల్ మూడుచోట్ల సభల్లో పాల్గొన్నారు. ముంబై ధారావి, చండీవలీ ప్రాంతాలతో పాటు లాతూర్ లోని ఔసా జిల్లాలో బహిరంగ సభల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత  రాహుల్ సభల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆర్టికల్ 370రద్దుతో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చామని, కశ్మీర్ లో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా స్వయంప్రతిపత్తిని రద్దు చేశామన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా. గతంలో ఏ ప్రధానికి కూడా ఆర్టికల్ 370ని టచ్ చేసే ధైర్యం లేకపోయిందని, కేవలం మోడీ వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. 


ఇక హర్యానా ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని ప్రశంసించారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు మరోసారి పట్టం కట్టాలని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న జరగనుంది. 24 ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: