దీర్ఘ‌కాలం త‌ర్వాత‌...క‌శ్మీర్ ప్ర‌జ‌లు టెక్ స్వేచ్ఛ‌ను పొందుతున్నారు. రెండు నెలల సుదీర్ఘ కాలం తర్వాత జమ్మూ కశ్మీర్ లో మొబైల్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఆగస్టు ఐదో తేదీ నుంచి లోయలో మొబైల్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 4 తేదీ వరకు లోయలో విడతల ప్రకారం..ల్యాండ్ లైన్ ఫోన్లపై నిషేధం ఎత్తేసింది. అయితే దాదాపు 20 లక్షల ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.


జమ్మూ, కశ్మీర్, కుప్వారాతోపాటు 10 జిల్లాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో  జమ్మూ, కశ్మీర్, లఢక్ ప్రాంతాల్లో మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొబైల్ సేవలపై ఆంక్షలు ఎత్తివేసిన సందర్భంగా.. జమ్మూ కశ్మీర్ గవర్నర్ కతువాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మొబైల్ సేవల కంటే.. జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రాణాలే ముఖ్యమని గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. మొబైల్ సేవల ద్వారా ఉగ్రవాదుల ఆగడాలు పెరిగిపోతాయన్న కారణంగానే..లోయలో మొబైల్ సేవలపై నిషేధం విధించినట్టు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న కారణంగా మొబైల్ సేవలపై ఆంక్షలు ఎత్తేసినట్టు వెల్లడించారు. ఆంక్షల కారణంగా దూరప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుకాలేదు. తాజా నిర్ణయంతో.. తమ కుటుంబ సభ్యులు, బంధువులతో మంచి చెడులు కశ్మీర్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు మొబైల్ సేవలపై ఆంక్షలు ఎత్తేయడంతో.. కశ్మీర్‌లో మొబైల్ రంగంలో వ్యాపారం ఊపందుకోనుంది. 


జమ్ముకశ్మీర్ ప్రత్యేక కార్యదర్శి, అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవలను శనివారమే పునరుద్ధరించాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల వీలుకాలేదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయ‌న్నారు. కశ్మీర్‌లోని పది జిల్లాల్లో ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ఇంటర్నెట్ సేవలను పొందేందుకు వినియోగదారులు ఇంకొంతకాలం వేచిఉండక తప్పదని స్పష్టంచేశారు. రెండ్రోజుల కిందటే పర్యాటకులను సైతం అనుమతించిన యంత్రాంగం.. ఇప్పటికే విద్యాసంస్థలను పునఃప్రారంభించింది. శాంతిని నెలకొల్పేందుకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు కన్సల్ కృతజ్ఞతలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: