ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌రాష్ట్రమైన‌ గుజరాత్‌లో ఊహించ‌ని అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. గాంధీనగర్‌లో సుఫలాం శాల వికాస్ సంకుల్ పేరుతో ప్రభుత్వ నిధులు పొందే సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ విద్యాసంస్థలకు చెందిన పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో అడిగిన రెండు ప్రశ్నలు విద్యాశాఖ అధికారులనే అవాక్కయ్యేలా చేశాయి. 


 గాంధీజీ హత్యకు గురయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, మహాత్మా గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అనే ప్రశ్న తొమ్మిదో తరగతి విద్యార్థుల పరీక్ష ప్రశ్నపత్రంలో కనిపించింది.  మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో మద్యం విక్రయాలపై 12వ తరగతి విద్యార్థులను అడిగిన ఓ ప్రశ్న సైతం అధికారులను ఇరుకున పడేసింది. మీ ప్రాంతంలో మద్యం విక్రయాలు పెరుగడం, సారా వ్యాపారులతో కలుగుతున్న ఇబ్బందులపై జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయండి అనే ప్రశ్న కనిపించింది. ఈ రెండు ప్రశ్న లు అభ్యంతరకరమైనవని, దీనిపై విచారణ ప్రారంభించామని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి భరత్ వాదిర్ తెలిపారు. ఆయా ప్రశ్నపత్రాలను పాఠశాల యాజమాన్యాలే రూపొందించాయని చెప్పారు. వీటి తో విద్యాశాఖకు సంబంధంలేదని స్పష్టంచేశారు.


మ‌రోవైపు, గుజ‌రాత్ పోలీసుల స‌మ‌న్వ‌యంతో....ఢిల్లీ పోలీసులు కీల‌క కేసును ఛేదించారు. అమృత్‌సర్‌నుంచి శనివారం న్యూఢిల్లీ వచ్చిన ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్ మోదీ.. నార్త్ ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలోని గుజరాతీ సమాజ్ భవన్ వద్ద ఆటో దిగి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె పర్సును లాక్కొని పరారయ్యారు. ప్రధాని మోదీ త‌మ్ముడి కూతురు పర్సును ఎత్తుకెళ్లిన ఈ ఇద్దరు దొంగలను ఢిల్లీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు. తొలుత హర్యానాలోని సోనిపట్‌లో గౌరవ్ అనే నిందితుడిని అరెస్ట్‌చేసిన పోలీసులు అనంతరం కొన్ని గంటలకే బాదల్ అనే మరో నిందితుడిని సుల్తాన్‌పురిలో అదుపులోకి తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: