దేశం మాంద్యంలోకి జారుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కేంద్రం వాస్తవాలు అంగీకరించడం లేదని ఆరోపించిన పరకాల.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పీవీ, మన్మోహన్ విధానాలే దిక్కన్నారు. అయితే మోడీ సర్కారు చాలా సంస్కరణలు ప్రవేశపెట్టిందని రిప్లై ఇచ్చారు నిర్మల సీతారామన్. 


దేశం దూసుకెళ్తోందని ప్రధాని మోడీ విదేశాల్లో చెబుతున్నారు. సినిమా కలెక్షన్లు చూస్తే అర్థం కావడం లేదా.. అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. మాంద్యం లేదు మందగమనం మాత్రమే ఉందంటున్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. వీరందరి ప్రకటనలపై ప్రతిపక్షాల విమర్శలు పక్కనపెడితే.. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మల భర్త పరకాల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దేశం మాంద్యంలోకి జారిపోతోందని, కేంద్రం వాస్తవాలు అంగీకరించడానికి సిద్ధంగా లేదని ఆయన ఆరోపించారు. 


మన్మోహన్, పీవీ ఆర్థిక విధానాలు అనుసరించడమే మాంద్యానికి మందన్నారు పరకాల ప్రభాకర్. నెహ్రూ ఆర్థిక విధానాల్ని విమర్శించడం కూడా అనవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిపై ఆర్థిక విమర్శలు కాకుండా..  రాజకీయ దాడి మాత్రమే చేస్తోందని అందరికీ అర్థమైందంటున్నారు పరకాల. వాహన అమ్మకాలు 11 నెలలుగా పడిపోతూనే ఉన్నాయని, నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని పరకాల గుర్తుచేశారు. ఐఎంఎఫ్ కూడా జీడీపీ అంచనా 6.8 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని, కానీ కేంద్రం మాత్రం తిరస్కార ధోరణిలో వెళ్తోందని చెప్పుకొచ్చారు. కొత్త విధానాలు రూపొందించడానికి మోడీ సర్కారు సుముఖంగా లేదని పరకాల ఆరోపించారు. కానీ పరకాల వాదనతో ఆర్థిక మంత్రి నిర్మల విభేదించారు. మోడీ హయాంలో ఎన్నో వ్యవస్థీకృత సంస్కరణలు తీసుకొచ్చామని ఆమె గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కేంద్రం చాలా చర్యలు తీసుకుంటోందని, అది అందరూ అర్థం చేసుకోవాలని కోరారు నిర్మల సీతారామన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: