వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ ఏడాది జూన్ 14న ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఆర్టీసీ విలీనం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన జగన్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.


అదే విధంగా ఏపీఎస్ ఆర్టీసి పేరు మారుస్తూ కూడా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పై ఆర్టీసీ పేరును ప్రజా రవాణా శాఖ (పీటీడీ) గా మారుస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసి విలీనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉండాలి, వారికి ఏ స్థాయి కల్పించాలి, పాలన యంత్రాంగం ఎలా ఉండాలనే అంశాల పై అధ్యయనానికి సర్కార్ ఆరుగురు నిపుణులతో ఓ కమిటీ వేసింది. దీనికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. ఆర్థికం, సాధారణ పరిపాలన, (సర్వీసులు), పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులను కమిటీలోకి సభ్యులుగా తీసుకున్నారు.


ఇక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పరిపాలన) సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత అధికారికంగా ఆర్టీసీ పేరు మార్పును అమల్లోకి తీసుకు వస్తామని తెలిపారు.. ఇకపోతే ఏపీఎస్ ఆర్టీసీ విలీనంతోపాటు సంస్థపై భారం తగ్గించే దిశగా జగన్ సర్కార్ యోచిస్తోంది. అందులో భాగంగానే విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు సమాలోచనలు చేస్తున్నారు.  తాజాగా రవాణా శాఖ కమిషనర్ అధ్యక్షతన నియమించిన కమిటీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేస్తుంది. కార్మికుల విలీనంతో పాటు, ఆర్టీసీ బిజినెస్ రూల్స్‌లో మార్పులు, శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలపై ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. వచ్చే నెలాఖరుకు నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: