ఆర్టీసీ స‌మ్మె విర‌మ‌ణ‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా ముందుకు వ‌చ్చిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని కే కేశవరావు చెప్పా రు. సీఎం ఆదేశిస్తే కార్మికులతో చర్చలు జరుపుతామన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కేకే తాజాగా మీడియాతో మాట్లాడుతూ....అనేక కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.తాను ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ముందుగాని, తర్వాత గానీ, సీఎం కేసీఆర్ గారితో నేను మాట్లాడలేదని ప్ర‌క‌టించిన ఆయ‌న‌...ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాన‌ని...అయితే...ఆయన త‌నకు అందుబాటులోకి రాలేదని వ్యాఖ్యానించారు.


ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం ఒక ప్రకటన విడుదలచేసిన కేశవరావు..సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు వెంటనే తమ సమ్మెను విరమించాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని లేఖలో సూచించారు. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంకావాలని కోరారు. దీనికి కొన‌సాగింపుగా...తాజాగా ఆయ‌న మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ...ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని అన్నారు. ఆత్మహత్యలు బాధించాయని తెలిపారు. సమ్మెతో పరిస్థితులు చేజారి పోతున్నాయనే అనుమానం వచ్చిందని అందుకే...ఆర్టీసీ కార్మికులు- ప్రభుత్వం కలిసి చర్చలు జరపాలని త‌ను త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. త‌న ప్ర‌క‌ట‌న‌తో ఆర్టీసీ కార్మికుల ఆశలు పెరిగాయన్నారు.


తాను చర్చలు జరుపుతానని అనలేదని కేకే వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే, మంచి జరుగుతుందని అనుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ఖచ్చితంగా చర్చలకు దిగుతాన‌ని ప్ర‌క‌టించారు.``ఇది పార్టీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య. కార్మికులు నాతో చర్చలకు సానుకూలంగా వుండటం మంచి పరిణామం. ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేందుకు నాకు ఎలాంటి అనుమతి రాలేదు. నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే వుంటాను. ప్రభుత్వ ఉద్దేశం ఏంటీ అనేది నాకు తెలియదు. తెలిస్తే సమస్య పరిష్కారం అయ్యేది. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను...అయితే...ఆయన నాకు అందుబాటులోకి రాలేదు` అని కేకే తెలిపారు. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని త‌న వ్యక్తిగత అభిప్రాయమని కేకే అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: