తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పుడు కెసిఆర్ కి తల నొప్పిగా మారింది. అటు కార్మికుల ఇబ్బందులని లెక్కచేయకుండా... తన పంథా లో తాను తీసుకుంటున్న నిర్ణయాలు ఒక నియంతృత్వ పాలనకు అద్దం పడుతున్నాయంటున్నారు కార్మికులు. తెలంగాణ కోసం పోరాడింది ఎవరైనా గాని.. మొత్తం  క్రెడిట్  మాత్రం కేసీఆర్ ఖాతాలో పడిందని చెప్పాలి. ఉద్యమానికి సారథ్యం వహించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమయ్యారన్న పేరు,ప్రఖ్యాతులే కాదు.. తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు.


అలాంటి ఉద్యమాధినేత.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. కొత్త మచ్చ తీసుకొచ్చేలా ఉన్నాయి.అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న వేళ.. ఉద్యమకారుల్ని అణిచివేసేందుకు ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలు చేసిన తీరులోనే.. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను పోలీసులతో అణిచి వేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు  కేసీఆర్ సర్కారు పై ఆరోపణలు వస్తున్నాయి.


ఉద్యమాన్ని నీరుకార్చటానికి ప్రయత్నిస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న వేళ సకల జనుల సమ్మె చేపడితే ఎస్మా ప్రయోగిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించారని.. ఈ రోజున కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి సమ్మె చేస్తున్న కార్మికుల ఉద్యోగాలు పీకేశామన్న ప్రకటనతో రెచ్చగొడుతున్నారన్న మండిపాటు పలువురు నేతల నోట వినిపిస్తోంది.తెలంగాణ రాష్ట్ర సాధనలో మారుమోగిన కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణ సాధనను అడ్డుకునేందుకు ప్రయత్నించి భంగపడిన కిరణ్ కుమార్ రెడ్డిగా... గులాబీ బాస్ పేరుని ముడివేయటాన్ని ఏమంటారు?  

ఇలాంటి పరిస్థితిని కేసీఆర్ తనకు తాను తెచ్చుకున్నారన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో  వ్యక్తమవుతోంది. తెలంగాణ జాతిపితగా యావత్ తెలంగాణ ప్రజానీకం నీరాజనాలు అందుకున్నవ్యక్తి.. తన నిర్ణయాలతో అందుకు భిన్నమైన రీతిలో మాట అనిపించుకోవటం సరైనదో కాదో కెసిఆర్ గారే తేల్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: