హర్యానాలోని చార్ఖీ దాద్రీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో హర్యానా ప్రజలు స్వచ్ఛమైన, పారదర్శక పాలనను అందించిన బిజెపికి మరొకసారి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. ఇకపోతే  రెజ్లర్‌ బబితా ఫోగట్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసి బిజెపి అభ్యర్థిగా చార్ఖీ దాద్రీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె గురించి మోడీ చెబుతూ హర్యానా కుమార్తెలు అన్ని రంగాల్లో తమ ప్రతిభ చాటుకుంటున్నారని అన్నారు. ఇక ఇప్పుడు ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్‌ నేతలు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆయన విమర్శించారు.


ఇదిలా వుండగా స్థానిక, జాతీయవాద అంశాలు ప్రస్తావిస్తూ దూకుడుగా ప్రసంగించారు. బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని అక్షరాల ఆచరిస్తున్న రాష్ట్రం హర్యానా అని కొనియాడారు. స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తీవ్ర లోటు ఎదుర్కొంటున్న..హర్యానాలో బాలికల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోందన్నారు. 2022 నాటికి హర్యానాలో ఇళ్లు లేని పేదలు ఉండరని ప్రధాని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సైనిక కుటుంబాలకు భరోసా ఇచ్చామని, దేశం కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలతో పాటు..కేంద్ర బలగాలు, పోలీసు కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించామని తెలిపారు.


అదీగాకుండా దేశ ప్రజల మద్దతుతోనే భారత్‌ ప్రస్తుతం సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో  అధికారంలో ఉన్న పార్టీలు ప్రస్తుతం ప్రతిపక్షంలో ప్రజల మద్దతు కోల్పోయి కళావిహీనంగా మారాయన్నారు. కానీ భాజపాకు రాష్ట్రంలో బలమైన బృందం ఉందని అన్నారు. అదేవిధంగా ఆయన జమ్మూకాశ్మీరు గురించి ప్రస్తావిస్తూ ఆర్టికల్‌ 370 రద్దు చేయడం గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. ఎవరు ఊహించని విధంగా భారత్‌ గొప్ప నిర్ణయాలు తీసుకుంటోందని, జమూ కాశ్మీర్, లద్ధాఖ్‌లు అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తున్నాయంటే.. ఆ గుర్తింపు 130 కోట్ల భారతీయులందరికీ దక్కుతుందని మోడీ తెలిపారు...


మరింత సమాచారం తెలుసుకోండి: