రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళనకు నడుం బిగించారు. అవినీతి, మధ్యవర్తుల కమీషన్లు, ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు చేపడుతున్నారు. ఇక నుంచి క్రయ, విక్రయదారులు స్వయంగా తన డాక్యుమెంట్‌ను తాను తయారు చేసుకొని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం అమల్లోకి తేవడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

ఏపీలో నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలులోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత ఆస్తుల క్రయ విక్రయదారులు స్వయంగా పత్రాలు తయారు చేసుకొని ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించేలా సేవలు అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద గంటలు, రోజుల కొద్ది వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉండవు.


ప్రయోగాత్మకంగా అమలు, సవరణలు

ఆన్‌లైన్‌లో తమ క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంటేషన్ తయారు చేయడమే కాదు, దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్ లోడ్ చేయడం ద్వారా టైమ్ స్లాట్‌ను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానం అమలు చేశారు. లోపాలను గుర్తించి, సవరణలు చేశారు.


ఈజీ రిజిస్ట్రేషన్... అందుబాటులో డాక్యుమెంట్స్

ఏపీలో ఇళ్లు, భవనాలు, భూములు, వ్యవసాయ భూములు మొదలగు సేల్ డీల్, సేల్ అగ్రిమెంట్, తాకట్టు రిజిస్ట్రేషన్, బహుమతి రిజిస్ట్రేషన్లు, జీపీఏ వంటి నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్లో పొందుపరిచారు. ఆస్తుల క్రయవిక్రయాలు జరిపేవారే వివరాలు నమోదు చేసుకునేలా వివిధ అవసరాలకు తగినట్లుగా 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచారు. ఈ డాక్యుమెంట్లలో తమ వివరాలను నింపి వాటిని అప్ లోడ్ చేయాలి. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్ రైటర్లు చేసేవారు. ఇప్పుడు క్రయ, విక్రయదారులు స్వయంగా చేసుకోవచ్చు.


అప్పీల్‌కు కూడా మీకు ఛాన్స్

కొత్త విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్స్‌ను ఏదైనా కారణాల వల్ల తిరస్కరిస్తే దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకు రిజిస్ట్రేషన్ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. డాక్యుమెంటును ఎందుకు తిరస్కరించారో నిర్ణీత సమయంలో మీకు సమాధానం వస్తుంది. అధికారులు కచ్చితంగా దీనికి సమాధానం చెప్పవలసి ఉంటుంది.


ప్రజల్లో అవగాహన

ఈ కొత్త సంస్కరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు బృందాల్ని ఏర్పాటు చేశారు. 14వ తేదీ నుంచి కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21న గుంటూరు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లాయర్లు, డాక్టర్లు, రియాల్టర్లు, బిల్డర్స్, నగర ప్రముఖులు, ప్రజలు అందరినీ ఆహ్వానించారు. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: