రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది తెలిసిన విష‌యమే. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కులు ఉన్నంత వ‌ర‌కు పార్టీల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే పార్టీల్లో త‌మ‌కు వ‌ర్క‌వుట్ కాద‌ని భావించే నాయ‌కులు ఆయా పార్టీల‌ను మారిపోతుంటారు. జంపింగుల‌కు ఏపీ రాజ‌కీయాలు పెట్టింది పేరు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి, మ‌రో పార్టీలో చేరిన నాయ‌కులు అనేక మందిని గ‌డిచిన ఐదేళ్ల కాలంలో మ‌నం ఎంతో మందిని చూశాం. ఇప్పుడు కూడా అదే కోవ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి జంప్ చేసే నాయ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి.


వీరిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి, విశాఖ ఉత్త‌రం నుంచి విజ‌యం సాధించి, జ‌గ‌న్ సునా మీని త‌ట్టుకుని గెలుపు గుర్రం ఎక్కిన గంటా శ్రీనివాస‌రావు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నాటి నుంచి కూ డా ఆయ‌న పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం సాగింది. అధికారంలో లేక‌పోతే.. ఆయ‌న ఉండ‌లేర‌నే ప్ర‌చారం కూ డా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అధికార పార్టీ వైసీపీలో కి జంప్ చేస్తార‌ని కొన్నాళ్ల‌పాటు ప్ర‌చారం సాగింది. కానీ, ఆయ‌న వైసీపీ అధినేత జ‌గ‌న్ పెట్టిన కండిష‌న్ల‌కు వెన‌క్కి త‌గ్గార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


సాధార‌ణంగా జ‌గ‌న్ సూత్రం ప్ర‌కారం.. ఏ పార్టీ త‌ర‌ఫున గెలిచినా.. త‌న పార్టీలోకి వ‌చ్చేవారు మాత్రం ఆయా ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించాల్సిందే. అదే స‌మ‌యంలో పార్టీలో ఆ ప‌ద‌వులు ఇస్తాం.. ఈ ప‌ద‌వులు ఇస్తామ‌నే హామీని కూడా ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ క‌రాఖండీగా చెబుతున్నారు. దీంతో ఈ నిబంధ‌న‌ల‌కు ఇష్ట‌మైన వారు పార్టీలోకి చేరుతున్నారు. లేనివారు మాత్రం మౌనంగా భ‌రిస్తున్నారు. ఇప్పుడు గంటా కూడా ఈ నిబంధ‌న‌ల‌కు ఇష్ట‌ప‌డ‌లేద‌ని, అందుకే ఆయ‌న వైసీపీకి దూరంగా ఉన్నార‌ని చెబుతున్నారు.


నిజానికి ఇప్పుడు జ‌గ‌న్‌కు భారీ మెజారిటీ ఉంది. ఆయ‌నకు బ‌య‌ట నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం కానీ, మ‌ద్ద‌తు కానీ లేదు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఆ పార్టీలో చేరాల‌ని అనుకున్నా జ‌గ‌న్ నిబంధ‌న‌ల‌కు ఇష్ట‌మై చేరాల్సిన ప‌రిస్థితి ఉంది త‌ప్పితే.. వారి ఇష్టాలు మాత్రం చెల్ల‌డం లేదు. మొత్తానికి గంటా విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌నే ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: