ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టగానే వర్షం.. సర్వేపల్లిలో హెలికాప్టర్‌ దిగిన వెంటనే వర్షం కురిసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైయస్‌ జగన్‌ అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం సీఎం జగన్ చేస్తున్నారని చెప్పారు.  వైయస్‌ఆర్‌ రైతు భరోసా పధకం అమలుతో దేశం దృష్టిని ఆకర్షించారన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంతో దేశం మొత్తం ఎవరీ నాయకుడు, ఏమిటీ ధైర్యం అని తిరిగి చూస్తోందని మంత్రి కురసాల అన్నారు. ఆ నాయకుడు.. మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని ఆయన స్పష్టం చేశారు.  రైతు భరోసా పథకం ప్రారంభోత్సవంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వ్యవసాయం అనేది వృత్తి కాదు.. జీవన విధానమని చెప్పారు. దాన్ని కాపాడుకోకపోతే అభివృద్ధి, పుట్టగతులు ఉండవని నమ్మి ప్రమాణస్వీకారం చేసిన రోజే రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించిన సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలందరి తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.


ఇంతకు ముందు విదేశీ నేతలతో పోల్చుకునేవారు.. సీఈఓలుగా పేరు తెచ్చుకోవాలనుకున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రైతుల గుండెల్లో స్థానం కల్పించుకోవాలని ఆకాంక్షించారన్నారు. రైతు కళ్లలో ఆనందం చూడాలనే తపిస్తున్నారన్నారని చెప్పారు. దాదాపు 54 లక్షల రైతు కుటుంబాలకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందించనున్నారన్నారు. లక్షల మందికి ఏకకాలంలో ఇవాళే.. సాయం అందిస్తున్నామన్నారు. ఖరీఫ్, రబీలో సాయం అందించేలా చూడాలని రైతు సంఘాలు సూచన చేస్తే వెంటనే పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500 పెంచి ఖరీఫ్, రబీ, సంక్రాంతి కానుకగా మూడు విడతల్లో ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.



అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో వ్యవసాయ రంగానికి చేసిన సేవలు చూస్తే వైయస్‌ఆర్‌ రైతు భరోసా, ఉచిత పంట బీమా పథకం, వడ్డీలేని పంట రుణాలు, చంద్రబాబు బకాయిపడి రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొడితే ఆ డబ్బులు కూడా నేనే ఇస్తానని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఉచితంగా వ్యవసాయ భూముల్లో బోర్లు వేయించడం, పామాయిల్, పొగాకు రైతులు మొదలుకొని రొయ్యల రైతులకు న్యాయం చేస్తున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల బాధ వర్ణణాతీతం.. ఖాళీ ఖజానా, రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు అప్పగిస్తే.. ఏం చేయలేడని అనుకున్నారని, చెప్పినవే కాదు..




చెప్పనివి కూడా నాలుగు నెలల్లో అమలు చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలకు మైండ్‌ బ్లాంక్‌ అవుతుందన్నారు. ఇక టీడీపీకి పుట్టగతులు ఉండవన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పేరుకు అర్థాన్ని నాలుగు నెలల్లో చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒక్క నెలలోనే గ్రామ సచివాలయాల పేరుతో యువజనులకు మేలు, వైయస్‌ఆర్‌ వాహనమిత్ర పేరుతో శ్రామికులకు ఆర్థిక సాయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందించి  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుకు అసలైన నిర్వచనం చెప్పారని మంత్రి కన్నబాబు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: