పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నటుడు.. అలాగే ప్రజలకు ఏదో చేయాలి.. అనే తపన ఉన్న నటుడు.. ఆ విషయంలో ఆయన చిత్తశుద్ధిని పెద్దగా అనుమానించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనే చెప్పినట్టు..ఏడాదికి కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని వదిలిపెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవ చేయాలని తపిస్తున్నారు.


అయితే రాజకీయాల్లో రాణించాలంటే బలమైన కోరిక ఒక్కటే సరిపోదు. అందుకు తగిన వ్యూహం ఉండాలి. దృఢ చిత్తం ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ కు ఇవేవీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయాల్లో స్థిరత్వం లేదన్న విమర్శ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఆయన తన సొంత ఐడెంటిటీను సృష్టించుకోకుండా.. తెలుగు దేశం తోక పార్టీగా తయారవుతున్నారన్న విమర్శ కూడా ఉంది.


తాజాగా కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ వైసీపీ పై చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. ఆ విమర్శల్లో వాస్తవం లేకపోలేదని అనిపిస్తుంది. సరిగ్గా ఎన్నికల ముందు కూడా ఇలాగే టీడీపీ పాట పాడిన పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో ఘోర పరాజయం తరవాత కూడా ఆ బాట వీడటం లేదు. టీడీపీ చేసిన ఆరోపణలే పవన్ కల్యాణ్ నోట కూడా వినిపించడం ద్వారా ఈ రెండూ ఒకటే అన్న ఫీలింగ్ జనంలో వచ్చింది.


ఇది మొన్నటి ఎన్నికల్లో జనసేన విజయావకాశాలను పూర్తిగా దెబ్బ తీసింది. టీడీపీ, జనసేన రెండింటి ఎజెండా ఒకటే అయినప్పుడు టీడీపీకే వేస్తే పోలా అనుకున్నారు జనం. అయితే పవన్ ఇంకా అదే తరహా టీడీపీ తమ్ముడి తరహాలో రాజకీయం చేయడం చూస్తే.. ఇక జనసేన గాడిన పడేదెప్పుడన్న నిరాశ కలగకమానదు. ఎప్పటికైనా ఏపీకి సీఎం కావాలనేది పవన్ కల్యాణ్ కల. కానీ ఆ కల అందుకోవాలంటే మాత్రం ఇలాంటి వ్యూహాలు మానుకుని సొంత ఐడెంటిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: