10వ తరగతి పాస్ అర్హతతో వేలాది మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగవకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కేంద్రంలోని ఇండియా పోస్ట్ శాఖ కొద్ది రోజుల క్రితమే దేశంలోని వివిధ సర్కిళ్ళలో  10 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

 

అలాంటి పోస్టులను తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో భర్తీ చేయటానికి రెడీ అయ్యింది. ఇందుకోసం 5476 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, డాక్ సేవక్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని ఇండియా పోస్టు శాఖ నిర్ణయించింది.

 

10వ తరగతి పాసైన వారు పై పోస్టులకు అర్హులుగా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్లు కూడా బుధవారం నుండి మొదలయ్యాయి. దరఖాస్తులు అందిచటానికి నవంబర్ 21వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. భర్తీ చేయబోయే మొత్తం  5476 పోస్టుల్లో తెలంగాణాలో 970, ఏపిలో 2707, ఛత్తీస్ ఘడ్ లో 1799 ఖాళీలున్నట్లు చెప్పింది.

 

పొస్టు ద్వారా దరఖాస్తులు చేసుకోవటాన్ని బుధవారమే ప్రారంభించగా ఆన్ లైన్లో దరఖాస్తులను  ఈనెల 22వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు నోటిఫికేషన్లో చెప్పింది. సరే ఎలా దరఖాస్తు చేయాలన్నా ఆఖరు తేదీ మాత్రం నవంబర్ 21వ తేదయే.  10వ తరగతి మొదటి ప్రయత్నంలో పాసైన వారిని మెరిట్ స్టూడెంట్స్ గా గుర్తిస్తామని నోటిఫికేషన్లో చెప్పారు.

 

పై రాష్ట్రాల నుండి దరఖాస్తు చేసేవారికి స్ధానిక భాష తప్పకుండా  వచ్చుండాలనే నిబంధనుంది. కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చుండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు, గుర్తింపు పొందిన  ప్రైవేటు సంస్ధల్లో కంప్యూటర్ బేసిక్ కోర్సులో శిక్షణ, సర్టిఫికేట్ తీసుకునుండాలన్నది ప్రధాన నిబంధన. లేకపోతే మెట్రిక్యులేషన్, ఇంటర్, ఉన్నత విద్యలో కంప్యూటర్ సబ్జెక్టు చదివున్నా చాలని కూడా నోటిఫికేషన్లో ఉంది.

 

దరఖాస్తు చేసుకునే వారికి అక్టోబర్ 15వ తేదీకి 16-40 ఏళ్ళ మధ్య వయస్సుండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్ళు, ఓబిసిలకు 3 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుందని కూడా చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: