జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడు, సినీ న‌టుడు పవన్ కళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి ముఖ్య‌నేత‌లు గుడ్‌బై చెప్ప‌డం, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరుతుండ‌టం, తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్‌గా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల స‌మ‌యంలో...జనసేన పార్టీ పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  నిర్ణయించారు. వివిధ అంశాల‌పై ఈ స‌మావేశంలో స‌వివ‌రంగా చ‌ర్చించ‌నున్నారు. ఈ భేటీతో పార్టీ భ‌విష్య‌త్ వ్యూహం ఖ‌రారు కానున్న‌ట్లు స‌మాచారం. 


ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు జ‌న‌సేన‌ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం, 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ  సమావేశాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలన తీరుతెన్నులు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశాలలో  చర్చించనున్నారు. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ పార్టీ కార్యాలయంలో జరుగుతాయని పార్టీ పేర్కొంది. 


కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్ లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరం. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని ఆయ‌న కోరారు. 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ మద్దతు తెలియచేసిన నేప‌థ్యంలో...ఆ రోజు కాకుండా మ‌రో రోజు పార్టీ స‌మావేశాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకే 20వ తేదీ రాజకీయ వ్యవహారాల కమిటీ  సమావేశాలు ఏర్పాటు చేశారు.



ఇదిలాఉండ‌గా, తాజాగా మ‌రో నేత జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మక్షంలో రాజోలుకు చెందిన జనసేన నేత KSN రాజు వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...2019లో జనసేన పార్టీకి ప‌నిచేశాన‌ని తెలిపారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులమై పార్టీ బలోపేతానికి కృషి చేయాల‌ని పార్టీలో చేరామ‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో రాజోలులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: