ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు కృషి చేయాలని  హైకోర్టు చేసిన సూచనను  రాష్ట్ర ప్రభుత్వం  ఏమాత్రం   పరిగణలోకి తీసుకుంటున్నట్లు  కన్పించడం లేదు . కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామన్న సంకేతాలు ఇప్పటి వరకూ ప్రభుత్వం వైపు నుంచి వెలువడలేదు . దీనితో ఆర్టీసీ కార్మికులతో ఇక చర్చలు జరిపేది లేదన్న మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది . అందుకే చర్చలపై ఇప్పటి వరకూ ప్రభుత్వం వైపు  ఎటువంటి  ప్రకటన వెలువడలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . 


  ప్రభుత్వం చర్చలకు పిలిస్తే  వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక వైపు  ఆర్టీసీ కార్మిక సంఘాల జే ఏ సీ నేతలు చెబుతుంటే ,  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కార్మిక సంఘాల నేతలతో  చర్చలకు ఏమాత్రం  సుముఖంగా ఉన్నట్లు కన్పించడం  లేదు . చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్న హైకోర్టు సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . అటు ఆర్టీసీ కార్మికులను , ఇటు ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపట్టిన విషయం తెల్సిందే . దసరా పండుగ ముందు సమ్మె చేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం పట్ల కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు , ఇప్పటి వరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది .


  కార్మికులు సమ్మె విరమించేలా చర్చలు జరపాలంటూ సూచించింది . అయితే కార్మిక సంఘాలతో ,  ప్రభుత్వం ఒక దశ లో రాజ్యసభ సభ్యుడు కేశవరావు ద్వారా చర్చలు  జరిపేందుకు సిద్ధపడిందన్న ఊహాగానాలు విన్పించాయి . ప్రభుత్వం ఒకే అంటే  మధ్యవర్తిగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేశవరావు ప్రకటించారు కానీ ఎందుకో ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించినట్లు కన్పించడంలేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: