అంద‌రి చూపు...ఇప్పుడు ముఖ్య‌మంత్రి టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వైపే. హోరాహోరీగా సాగుతున్న ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో...గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణ‌యం...ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని నిర్వహించే ఉప ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ప్రసంగిస్తారు. అయితే, కీల‌క‌మైన ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో...కేసీఆర్ ఏం ప్ర‌క‌టించ‌నున్నార‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.


సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేదని కార్మికసంఘాలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభినందర్‌కుమార్ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వేతనాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. వేతనాల విభాగంలో పనిచేసే కార్మికులు కూడా సమ్మెలో ఉండటంతో ఆలస్యమైందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వేతనాలను సోమవారంకల్లా చెల్లించి, తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 21కి వాయిదావేసింది. మ‌రోవైపు కార్మికులు త‌మ ఆందోళ‌న రూపం మార్చుతున్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ గురువారం సమావేశంకానున్నది. టీఎన్జీవో భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వీ మమత సహా జేఏసీలోని ఉద్యోగసంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశం అనంతరం జేఏసీ ప్రతినిధులు సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను కలువనున్నారు. ఆర్టీసీ సమ్మెతోపాటు ఉద్యోగుల అంశాలపై వినతిపత్రం సమర్పించనున్నారు. ఉద్యోగుల జేఏసీ సమావేశం బుధవారం నిర్వహించాలనుకున్నా.. అనివార్య కారణాలతో వాయిదాపడింది. కాగా, ఆర్టీసీ పరిధిలోని ప్రతి బస్సును నడుపాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బస్‌డిపోల్లో కండిషన్‌లో ఉన్న ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ అద్దెబస్సులన్నీ నడిపించాలని, దీనికోసం తాత్కాలిక డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. 


ఇదే స‌మ‌యంలో...ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటం, బహిరంగసభకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రచారం మరింత జోరందుకోనుంది. గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో...సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. హుజూర్‌న‌గర్ ఉప ఎన్నిక కీలకంగా మారిన నేప‌థ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో సమ్మెపై ఏమైనా చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: