ఆపరేషన్ రాయల్ వశిష్టకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అధికారుల నుండి ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీత పనులు ఆపాలని ఆదేశాలు అందాయి. ధర్మాడి సత్యం బృందం ఈరోజు ఉదయం లంగరు వేసి బోటు బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అధికారుల ఆదేశాలతో ధర్మాడి సత్యం బృందం అమోమయానికి గురవుతోందని తెలుస్తోంది. 
 
కాకినాడ నుండి నిపుణుల బృందాన్ని అధికారులు బోటు వెలికితీయటంలో సూచనల కొరకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోటును వెలికితీసే పనులు పూర్తిగా ఆగిపోయాయని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల తరువాత కాకినాడ బృందం కచ్చులూరుకు చేరుకుంటుంటుందని సమాచారం. ధర్మాడి సత్యం బృందం గోదావరిలో వరద ప్రవాహం తగ్గటంతో రెండు రోజుల నుండి బోటును వెలికితీసే పనుల్లో నిమగ్నమైంది. 
 
ధర్మాడి సత్యం బృందం 120 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించింది. ధర్మాడి సత్యం బృందంలో 25 మంది నిపుణులు, కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. కాకినాడ నిపుణుల బృందం కచ్చులూరు ప్రాంతానికి చేరుకున్న తరువాత బృందం సూచనల మేరకు ధర్మాడి సత్యం బృందం పని చేయాలనే ఆదేశాలు ఉన్నతాధికారుల నుండి వచ్చినట్లు తెలుస్తోంది. బోటు పనులు మరలా ఎప్పుడు ప్రారంభం అవుతాయి? అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
సెప్టెంబర్ 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇవ్వలేదు. నిపుణులు వచ్చిన తరువాత ధర్మాడి సత్యం బృందానికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు...? అనే విషయం గురించి ఈరోజు మధ్యాహ్నం కాకినాడ నిపుణుల బృందం వచ్చిన తరువాత స్పష్టత రానుంది. అధికారులు అకస్మాత్తుగా కాకినాడ నుండి నిపుణుల బృందాన్ని రప్పించటానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: