ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టిడిపి పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఓటమిని మూటకట్టుకుంది. చంద్రబాబు వయసు పైబడటం తో వచ్చే ఎన్నికల వరకు ఆయన పార్టీని నడిపిస్తాడా ? అన్న సందేహాలతో ఉన్న టిడిపి సీనియర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు. టీడీపీ లో పలువురు వ్యాపారవేత్తలు ఇప్పటికే బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇక వ్యాపారాల నేపథ్యంలో మరికొందరు నేతలు అధికారంలో ఉన్న వైసీపీలోకి కొందరు జంప్ చేయగా, మరికొందరు జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. వచ్చే ఐదేళ్ల వరకు ఆ పార్టీకి ఎలాంటి పదవులు దక్కే ఛాన్స్ లేదు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో టిడిపి విజయం సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక 2024 ఎన్నికల వరకు టీడీపీకి ఎమ్మెల్సీలు... రాజ్యసభ స్థానాలు ఒక్కటి కూడా దక్కవు. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎన్నో ఆశలతో పనిచేసిన వారంతా ఈ సారి అధికారంలోకి వస్తే తమకు పదవులు వస్తాయని చంద్రబాబు హామీలతో వెయిట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో వారంతా తట్ట బుట్ట సర్దుకుంటున్నారు. ఇదిలా ఉంటే కనీసం పార్టీపరంగా వచ్చే పదవులు పైన ఆశలు పెట్టుకున్న వాళ్లకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు.


టిడిపిలో విధానాల పరంగా అత్యున్నత కమిటీ టిడిపి పొలిట్ బ్యూరో తాజాగా చంద్రబాబు ముగ్గురు నేతలకు అవకాశం ఇచ్చారు. పార్టీ సీనియర్‌ నాయకులు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ మంత్రి, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించారు. తాజాగా చంద్రబాబు పోలిట్ బ్యూరో లోకి తీసుకున్న నేతల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్లా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పొలిట్ బ్యూరో లో గల్లా అరుణకుమారి ఉండగా.. ఇప్పుడు అదే కుటుంబం నుంచి గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ను సైతం పొలిట్ బ్యూరో లోకి తీసుకోవడంతో పార్టీలో చాలా మంది సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.


పార్టీకోసం పనిచేస్తున్న ఉండగానే తమను కాదని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరుని పొలిట్ బ్యూరో లోకి తీసుకోవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి పి‌ఏ‌సి పదవిని తన సామాజిక వర్గానికి చెందిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు పొలిట్ బ్యూరో లోనూ తన సామాజిక వర్గానికి చెందిన గ‌ల్లాకు ఇవ్వడంతో పార్టీలో బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన నేతలు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా ఐదేళ్ల పాటు ఇతర పదవులు ఎలాగూ వచ్చే పరిస్థితి లేదు. కనీసం పార్టీ పరంగా అయినా గౌరవం ఉందని భావించిన వారికి చంద్రబాబు ఇస్తుండటంతో వారంతా లోలోన తీవ్రంగా రగిలిపోతున్నారు. ఇక వీరు బాబుకు ఎప్పుడైనా షాక్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: