ఒక  వైపు ఉప ఎన్నిక, మరోవైపు ఆర్టీసీ సమ్మె. దీంతో తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎలాగైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని, ఈ ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే అనుకోని అవాంతరంగా ఆర్టీసీ సమ్మె వచ్చి పడింది. ఈ సమ్మె ప్రభావం కచ్చితంగా ఉప ఎన్నికపై పడి తీరుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉండగా, సమ్మె సెగ స్వయంగా కేసీఆర్ కు కూడా తగిలే సమయం ఆసన్నమైంది.


అవును.. ఈరోజు హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈరోజు హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జన సమీకరణ కూడా చేస్తున్నారు.


బహిరంగ సభ కావడంతో ఆర్టీసీ సమ్మెపై ప్లకార్డులు ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇప్పటికే సమాచారం అందింది. సీఎం డౌన్ డౌన్ అంటూ ఒక్క నినాదం వినిపించినా, ప్లకార్డు కనిపించినా అది కేసీఆర్ ప్రతిష్టకే మచ్చ. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు మరింత అప్రమత్తమయ్యాయి. పోలీసు నిఘా ఏర్పాటుచేయడంతో పాటు.. ప్రజల్లోనే తమ కార్యకర్తల్ని పెట్టి రహస్యంగా పర్యవేక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.


మరోవైపు హైకోర్టు ఆదేశాల  నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. మొన్నటివరకు చర్చలకు ససేమిరా అన్న కేసీఆర్, ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలతో మరో దఫా చర్చలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఆల్రెడీ ఏర్పాటుచేసిన ముగ్గురు అధికారుల బృందంతో చర్చలు కొనసాగించాలా లేక మంత్రులతో మరో కమిటీ ఏర్పాటుచేయాలా అనే అంశంపై కేసీఆర్ నిన్న రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. త్రిసభ్య  మంత్రులతో కమిటీ వేయడం పైన  మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: