తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ విషయంలో ఇద్దరు సీఎంలు పూర్తిగా భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. కేసీఆర్ సర్కారు అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానిస్తుండగా.. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఇందుకు పూర్తివిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లకు తీర్చే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులంటుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని.. కేసీఆర్ తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. తెలంగాణ లో  50 శాతం ఆర్టీసీ బస్సులు 30 శాతం అద్దె బస్సులు.. 20 శాతం బస్సులు ప్రయివేట్ వ్యక్తులు నడిపేలా ఉండాలని కేసీర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో 1035 బస్సులను అద్దెకు తీసుకోవడం కోసం టెండర్లు ఆహ్వానిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  1035 అద్దె బస్సుల్లో 764 బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరగనున్నాయి. 
ఈ బస్సులు ఆర్టీసీలో చేరితే.. సంస్థలో అద్దె వాహనాల సంఖ్య 3000కు చేరుతుంది. ఈ విధానంలో డ్రైవర్, ఇంధన వ్యయాలను బస్సు ఆపరేటర్ భరించాల్సి వస్తుంది.  బస్సు తిరిగిన దూరాన్ని బట్టి ఆర్టీసీ అతడికి డబ్బు చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో కిలోమీటర్‌కు రూ.9.6 చెల్లిస్తే.. గ్రామాలు, మిగతా పట్టణాల్లో కిలోమీటర్‌కు రూ.6 చొప్పున చెల్లిస్తారు. 


ఈ విధానం ద్వారా ఆర్టీసీకి కిలోమీటర్‌కు దాదాపు రూ.8 వరకు ఆదా అవుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.  సిటీలో పని చేసే డ్రైవర్లకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇవ్వాల్సి ఉండగా.... అద్దె బస్సుల వల్ల ఆ భారం కూడా తప్పుతుందని వారు తెలిపారు. నిర్వహణ భారం తగ్గించుకోవడం కోసం, సంస్థను లాభాల బాట పట్టించడం కోసం కేసీఆర్ సర్కారు అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానిస్తుండగా... ఏపీ సీఎం జగన్ ఇందుకు పూర్తివిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. 

బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పాతబడిన ఆర్టీసీ బస్సుల స్థానంలో వెయ్యి కోట్ల రూపాయలతో 3677 బస్సులు కొనుగోలు చేయడానికి జగన్ ఓకే చెప్పారు. ఈ నిధులను ఆర్టీసీ రుణం రూపేణా సమీకరించనుంది. వీరిద్దరిలో ఎవరు తీసుకునే నిర్ణయాలు ఆర్టీసీకి ఎక్కువగా ఉపకరిస్తాయనేది కొద్ది కాలం ఆగితే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: