ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ ఫై మరో కేసు. నకిలీ ఐడీ కార్డు రూపొందించినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.ఇప్పటికే పలు కేసుల్లో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు ఆయణ్ని పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు.


టీవీ9 ఛానల్ సీఈవోగా వ్యవహరించిన రవిప్రకాశ్‌పై సంస్థ నిధులు దారి మళ్లించారనే కేసు నమోదైంది. ఆ క్రమంలో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనపై మరో కేసు నమోదు కావడం చర్చానీయాంశమైంది. ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐ ల్యాబ్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరు పరిచారు.ఆయనపై 406/66 ఐటీ యాక్ట్ కింద సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.


టీవీ9 సంస్థ తొలుత ఎబీసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఉంది. ఆ సమయంలో రవిప్రకాశ్ ఆ సంస్థకు సీఈవోగా వ్యవహరించారు. అయితే సంస్థకు చెందిన 18 కోట్ల రూపాయలను బోర్డు సభ్యులకు చెప్పకుండా అక్రమంగా దారి మళ్లించారనే అభియోగాలు నమోదయ్యాయి. ఆయనతో పాటు మరో ఉద్యోగి కేవీఎన్ మూర్తి కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. అలందా మీడియా ప్రతినిధులు వీరిద్దరిపై కేసు పెట్టారు. ఆ క్రమంలో రవిప్రకాశ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఛానల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు మాయం కావడం.. ఫోర్జరీ సంతకాలు తదితర ఆరోపణలు కూడా ఆ కేసులో కీలకంగా మారాయి.


అంతేకాదు, ఆయనపై ఇటీవల రామారావు అనే న్యాయవాది మరో ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్‌ మీడియా హౌస్‌కు చెందిన వెబ్‌ఛానెళ్లలో తనపై తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాలను ప్రచురించారని ఆయన ఆరోపించారు. పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: