ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. నిన్న సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇకనుండి రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరగబోతుంది. 
 
ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంటర్వ్యూ విధానం, పరీక్షల నిర్వహణ గురించి అధికారులతో చర్చించారు. అధికారులు ఏపీపీఎస్సీ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు న్యాయ వివాదాలకు కారణమవుతున్నాయని సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం అవినీతి, పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోస్టుల భర్తీలో పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని అన్నారు. 
 
 గ్రూప్ 1, గ్రూప్ 2 సహా అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం అధికారులతో చెప్పారు. జనవరి 1వ తేదీన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం చెప్పారు. పోస్టుల భర్తీలో అత్యవసర సర్వీసులు అందించే విభాగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. సీఎం జగన్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలలో ఇంటర్వ్యూలు రద్దు చేయటంపై నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండటంతో ఇంటర్వ్యూల్లో కొంత వెనకబడుతున్న విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం వలన నిజమైన ప్రతిభావంతులకే ఉద్యోగాలు దక్కుతాయని, ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు అవకాశం ఉండదని నిరుద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలలో అక్రమాలకు తెరదించారనే అభిప్రాయం నిరుద్యోగుల్లో బలంగా వ్యక్తమవుతోంది. చాలా మంది అభ్యర్థులు రాత పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించినప్పటికీ ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావటం వలన ఉద్యోగాలు కోల్పోతున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రాత పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపితే సులభంగా ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: