హోరాహోరీగా సాగుతూ...అన్నివ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నికలో గురువారం కీల‌క ప‌రిణామాలు సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్ర‌సంగించాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్‌నగర్ బహిరంగసభకు కేసీఆర్ విచ్చేస్తార‌ని నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే కొద్దిసేప‌తి త‌ర్వాత మెరుపులతో కూడిన భారీవర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నదని ఏవియేషన్ అధికారులు సీఎం హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంతో సభ రద్దయినట్టు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభా వేదికపై ప్రకటించారు. పైలట్ల సూచన మేరకు హెలికాప్టర్‌కు అనుమతి రద్దుచేసినట్టు ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారని వెల్ల‌డించారు.ముఖ్య‌మంత్రి కేసీఆర్ టూర్ ర‌ద్ద‌వ‌డంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. 


వాతావరణం అనుకూలించలేదు అన్న సాకుతో కేసీఆర్ గారు హుజూర్నగర్ పర్యటనను వాయిదా వేసుకోవడం వెనక అసలు మతలబు వేరే ఉందని ఆమె పేర్కొన్నారు. ``నిజంగా హుజూర్‌నగర్‌లో పర్యటించాలని సీఎం భావించి ఉంటే ...రోడ్డు మార్గం ద్వారా అయినా ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. కానీ కేవలం హెలికాప్టర్ ద్వారానే హుజూర్‌నగర్‌కు వెళ్లాలని కేసీఆర్ భావించడానికి కారణం.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన సెగ తగులుతుందేమో అనే భయమే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ మంత్రులను కొన్ని ప్రాంతాల్లో అడ్డుకోవడాన్ని చూస్తున్నాం. మంత్రుల పరిస్థితే తనకు కూడా పడుతుందేమో... చేదు అనుభవం ఎదురవుతుందేమో... అన్న టెన్షన్ దొరగారికి మొదలైనట్లుంది. అందుకే కేవలం 200 కిలోమీటర్ల దూరం ఉన్న హుజూర్‌నగర్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లే సాహసం చేయలేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దొరగారు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించినట్లేనని భావించాల్సి ఉంటుంది.`` అని ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఫేస్‌బుక్‌లో ఆమె ఓ ఫోస్ట్ పెట్టారు. 


ఇదిలాఉండ‌గా, ఉద‌యం నుంచి పొడిగా ఉన్న వాతావరణం  మ‌ధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతంగా మారి.. ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. హుజూర్‌నగర్ వీధులన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చిన‌ ప్రజలు, వాహనాలతో కిక్కిరిసిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: