మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పుణే, సతారా, పర్లిల్లో జరిగిన బహిరంగసభల్లో  పాల్గొన్న ప్రధాని మోది కార్యకర్తల్లో జోష్ నింపుతూ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి గత విజయాల రికార్డులను తిరగరాస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రగతి దీక్షతో బిజెపి సాగుతోందని, స్వ చింతనతోనే ప్రతిపక్షాలు కదులుతున్నాయని, విజయం ఎవరిదనేది ఈ ఎన్నికలలో తేలుతుందని చెప్పారు. ఇక్కడి వారిని, వారి దేశభక్తిని తాను అన్ని విధాలుగా విశ్వసిస్తానని, ఇక్కడి వారు దేశ ప్రయోజనాలకోసం, దేశ వ్యతిరేకులను తిప్పికొడుతారని, ఈ ఎన్నికలలో ఇదే జరుగుతుందని జోస్యం చెప్పారు.


ఇకపోతే జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హేళన చేస్తున్న వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులకు శిక్షించే సదవకాశం ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు వచ్చిందన్నారు. ఇదేగాకుండా గత ఐదేళ్లలో భారత్‌లో పెట్టుబడులు ఐదు రెట్లు పెరిగాయని చెప్పారు. గత 70 ఏళ్లుగా ఆర్టికల్‌ 370 గురించి అంతా మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ దాన్ని రద్దు చేయాలనే అన్నారు. కానీ ఎవరూ ఆ ధైర్యం చేయలేదు. మేం చేశాం. యథాతథ స్థితిని మార్చాలనుకున్నప్పుడు వ్యతిరేకతలు, నిరసనలు ఉంటాయి.


వాటికి మేం భయపడలేదు. 21వ శతాబ్దపు భారత్‌ మార్పులకు భయపడదు  అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు  ప్రజాధనాన్ని దోచుకుతింటూ వచ్చిన వారిని జైలుకు పంపే ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. ఇక ఈ ప్రాంతం బిజెపికి బ్రహరథం పడుతుందని చెప్పడంలో ఇక్కడ కమల వికాసానికి తిరుగులేదని తెలియచేయడంలో తనకు ఎటువంటి అపనమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ , ఎన్‌సిపిలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని, వారికి బిజెపిని ఎదిరించే ధైర్యం లేదని, బిజెపి సభలకు తరలివస్తున్న జనాన్ని చూసి వారు జడుసుకుంటున్నారని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: